బ్రిటన్‌లో ఇండియన్ రెస్టారెంట్స్‌లో తనిఖీలు... మొత్తం 19000 మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌ వెనక్కు

Update: 2025-02-11 08:19 GMT

బ్రిటన్‌లో ఇండియన్ రెస్టారెంట్స్‌లో తనిఖీలు... 19000 మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌ వెనక్కు

ఇప్పటివరకు అమెరికాతోనే టెన్షన్ పడిన భారతీయులకు ఇప్పుడు బ్రిటన్ కూడా షాకిస్తోంది. తమ దేశంలో అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిని వెనక్కు పంపించే పనిని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ వేగవంతం చేశారు. బ్రిటన్ వెనక్కు పంపిస్తున్న వారిలో ఇండియన్స్ కూడా ఉన్నారు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌ను గుర్తించడం కోసం బ్రిటన్ సర్కారు ప్రైవేట్ సంస్థలు, అక్రమ వలసదారులు ఎక్కువగా పనులు చేసుకునే చోట సోదాలు చేస్తోంది.

ఇండియన్ రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్, బార్లు, కార్ వాషింగ్ సెంటర్స్ వంటి వ్యాపార సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. అలా గతేడాది జులైలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇప్పటికే అన్నిదేశాల నుండి కలిపి మొత్తం 19000 మంది అక్రమ వలసదారులను గుర్తించి వారి సొంత దేశాలకు పంపించారు.

ఈ జనవరి నెలలో మొత్తం 828 చోట్ల తనిఖీలు జరిపారు. గతేడాది జనవరి నెలతో పోల్చుకుంటే ఇది 48 శాతం ఎక్కువ. ఈ ఏడాది జనవరి నెలలో 609 మంది అక్రమవలసదారులను అరెస్ట్ చేశారు. గతేడాది జనవరిలో అరెస్ట్ అయిన వారితో పోల్చుకుంటే ఈ సంఖ్య కూడా 73 శాతం పెరిగింది. బ్రిటీష్ హోమ్ సెక్రటరీ వైవెట్ కూపర్ ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌ను వెతికి పట్టుకునే పనిని మానిటర్ చేస్తున్నారు.

అక్రమ వలసదారుల గురించి తమకు అందుతున్న స్పష్టమైన సమాచారం ప్రకారమే సోదాలు చేస్తున్నామని కూపర్ తెలిపారు. గతేడాది పట్టుబడిన వారిలో ఎక్కువగా హోటల్స్, కేఫ్స్, ఫుడ్, బేవరెజెస్, పొగాకు ఉత్పత్తుల బిజినెస్‌లలో పనిచేసే వారే ఉన్నారని అన్నారు. నార్త్ ఇంగ్లండ్ లోని హంబర్ సైడ్ లో ఉన్న ఒక ఇండియన్ రెస్టారెంట్ లో సోదాలు చేసి ఆ ఒక్కచోటే ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మరో నలుగురుని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

"విదేశాల నుండి వచ్చే వారికోసం కొన్ని నిబంధనలు ఉన్నాయి. విదేశాల నుండి వచ్చే వారు ఆ చట్టాలను గౌరవించాలి. కానీ అలా జరగడం లేదు. ఎంతోమంది అక్రమంగా వలస వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నారు. వారికి వాడుకునే వాళ్లు వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. కానీ ఇకపై అలా కుదరదు" అని కూపర్ తేల్చిచెప్పారు. అక్రమ మార్గాల్లో చిన్నచిన్న బోట్లలో ఇక్కడికి వచ్చే వారు వారి ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. అంతేకాదు... ఇది వలస చట్టాలను ఉల్లంఘించి ఆర్థిక నేరం చేయడమే అవుతుందని కూపర్ అభిప్రాయపడ్డారు.

చెప్పడం కాదు... చేసి చూపిస్తున్న స్టార్మర్

బ్రిటన్ లో గతేడాది జులైలో ఎన్నికలు జరిగాయి. అక్కడ కూడా అమెరికా తరహాలోనే ఇల్లీగల్ ఇమ్మిగ్రంట్స్ ను వెనక్కి పంపిస్తామని ఎన్నికల్లో పోటీ చేసిన కీర్ స్టార్మర్ స్థానికులకు హామీ ఇచ్చారు. స్టార్మర్ నేతృత్వంలో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుండే ఈ హామీ నెరవేర్చాలంటూ స్టార్మర్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో స్టార్మర్ అక్రమవలసదారులను వెతికి వారిని సొంత దేశాలకు పంపిస్తున్నారు. సొంత దేశాలకు పంపిస్తున్న వారిలో బ్రిటన్ నేరాలకు డ్రగ్స్, చోరీలు, అత్యాచారాలు, హత్యానేరాలకు పాల్పడి దొరికిపోయిన వారు కూడా ఉన్నారు.

ఇప్పటివరకు ఈ విషయాన్ని పెద్దగా బయటికి చెప్పని బ్రిటన్ సర్కారు తాజాగా ట్రంప్‌ను చూసి తొలిసారిగా మాస్ డిపోర్టేషన్ వీడియోను విడుదల చేసింది. ఎయిర్ పోర్టులో బస్సులోంచి అక్రమవలసదారులు దిగి విమానం ఎక్కుతున్న దృశ్యాలను ఆ వీడియోలో చూడొచ్చు.

అక్రమ వలసదారుల సంఖ్యను బట్టి అందుకు అవసరమైన బిస్పోక్ చార్టర్ ఫ్లైట్స్ ఉపయోగిస్తున్నారు. బిస్పోక్ చార్టర్ ఫ్లైట్స్ అంటే నలుగురైదుగురు కూర్చొనే మినీ సైజ్ ఫ్లైట్స్ నుండి 20 మందికి సీటింగ్ కెపాసిటీ ఉండే మీడియం సైజ్ ఫ్లైట్స్ వరకు ఉంటాయి. అలాగే 380 మంది ప్రయాణించే వైడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఉంటాయి. 

Tags:    

Similar News