అనుచరుడు ఇచ్చిన సమాచారంతోనే ఐసిస్‌ చీఫ్‌ హతం!

Update: 2019-10-28 12:53 GMT

కరుడుగట్టిన టెర్రరిస్ట్ బాగ్దాదీ హతం వెనుక పెద్ద స్కెచ్ ఉంది సొంత అనుచరుడు ఇచ్చిన సమాచారమే బాగ్దాది అంతానికి కారణమైంది. అల్‌ఖైదా అనుబంధ సంస్థ సైన్యానికి బాగ్దాదీ సమాచారం అందించినట్లు తెలుస్తోంది. వెంటాడి వేటాడి వేటాడి కరుడుగట్టిన తీవ్రవాది హతమయ్యేలా చేశారు.

ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన టెర్రరిస్ట్ అబు బకర్ అల్ బాగ్దాదీ కోసం కొన్నేళ్లుగా బలగాలు గాలిస్తున్నాయి. అతడి అంతానికి 2018లో బీజం పడింది. అతడి అత్యంత సన్నిహితుల్లో ఒకరు ముష్కరుడి కదలికలపై సమాచారం అందజేసినట్లు తెలుస్తోంది. బాగ్దాదీకి ఐదుగురు సన్నిహిత అనుచరుల్లో ఇస్మామయిల్ అల్ ఎతావి ఒకరు. టర్కీ బలగాలు ఇతన్ని అరెస్టు చేసి ఇరాకీ సైన్యానికి అప్పగించాయి. ఎతావి బాగ్దాదీకి సంబంధించిన కీలక సమాచారాన్ని సైన్యానికి అందించాడు. కూరగాయలు రవాణా చేసే ట్రక్కుల్లో బాగ్దాదీ ప్రయాణించేవాడని తెలిపాడు. కమాండర్లతో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించేవాడని చెప్పారు. బాగ్దాదీ తన అనుచరులను కలిసే సిరియాలోని కొన్ని ప్రాంతాలను కూడా ఎతావి తమకు చెప్పాడని ఇరాక్‌కు చెందిన ఓ భద్రతా అధికారి తెలిపారు.

బాగ్దాదీ చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటున్న తరుణంలో ఎతావి ఇచ్చిన సమాచారం కీలకంగా మారింది. బాగ్దాదీ ముఖ్య అనుచరుడు ఎతావి పట్టుబడటమే బాగ్దాదీని అంతమొందించేందుకు టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఇస్లామిక్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ చేసిన ఎతావి 2006లో అల్‌ ఖైదాలో చేరాడు. అతన్ని 2008లో అమెరికా బలగాలు అరెస్టు చేశాయి. ఎతావి నాలుగేళ్లపాటు జైలు జీవితం గడిపాడు. తిరిగి వచ్చిన తర్వాత ఐసీస్‌లో చేరాడు. బాగ్దాదీకి కీలక అనుచరుడుగా ఎదిగాడు. మతపరమైన బోధనలు చేయడం, కమాండర్లను ఎంపిక చేసే బాధ్యతలు అప్పగించాడు బాగ్దాదీ. అమెరికా బలగాలు ఐసీస్ పై విరుచుకుపడటంతో 2017లో ఎతావి కుటుంబంతో కలిసి సిరియాకు మకాం మార్చాడు.

2018లో ఇరాక్ బలగాలు అతన్ని అరెస్టు చేసి కీలక విషయాన్ని రాబట్టారు. దీంతో పాటు మరికొంతమంది ఐసీస్ నేతలు పట్టుబడటంతో బాగ్దాదీ ఆచూకీ కనిపెట్టేందుకు ఉపయోగపడింది. వీరు ఐసీసీ నేత సంచరించే కీలక ప్రాంతాల సమాచారం ఇచ్చారు. వీరిచ్చిన సమాచారంతో సిరియాలోని ఇడ్లిట్ ప్రాంతంలో బాగ్దాదీ కుటుంబంతో కలిసి వివిధ గ్రామాలకు మారుతున్నాడని నిఘా వర్గాలు పసిగట్టాయి. ఓరోజు ఇరాక్‌కు చెందిన వ్యక్తి అక్కడి మార్కెట్ ప్రాంతంలో సంచరిస్తుండటం గమనించారు. అతడు ఎతావి అని గుర్తించారు. అతన్ని అనుసరిస్తూ వెళ్లడంతో చివరకు అతను బాగ్దాదీ ఉన్న ఇంటికి చేరుకున్నాడు. గత ఐదు నెలలుగా శాటిలైట్ , డ్రోన్ల సాయంతో ఆ ప్రాంతంలో నిఘా పెంచారు. ఇటీవల మినీ బస్‌‌లో పక్కనున్న గ్రామానికి బాగ్దాదీ వెళ్లడం గమనించారు. అతడు బాగ్దాదీయేనని దృవీకరించుకున్నారు.

ఇడ్లిట్ ప్రాంతంలో జిహాదీ సంస్థ హయత్ తారిర్ అల్ శామ్ కూడా బాగ్దాదీ కోసం గాలిస్తోంది. సిరియా యుద్ధంలో ఐసీసీ‌తో అల్‌ఖైదాకు అనుబంధమైన ఈ సంస్థ తలబడింది. తారిర్ సంస్థకి టర్కి బలగాలతో సంబంధాలున్నట్లు తెలిసింది. బలగాల గాలింపు చర్యలు పురోగతి సమాచారం నిఘావర్గాలకు అందింది. బాగ్దాదీపై భారీ నిఘాతో పాటు టర్కీ, సిరియా, అమెరికా ప్రత్యేక బలగాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు బాగ్దాదీ కదలికలను పసిగట్టాయి. బలగాలు బాగ్దాదీని చుట్టు ముట్టడంతో అతను ఆత్మాహుతి చేసుకున్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News