Earthquake: శిథిలాల కింద 10 రోజుల పసికందు.. 90 గంటలు మృత్యువుతో పోరాడి గెలిచి..

Earthquake: టర్కీలో సంభవించిన భూకంపంలో..శిశువును, తల్లిని రక్షించిన సహాయక సిబ్బంది

Update: 2023-02-11 11:23 GMT

Earthquake: శిథిలాల కింద 10 రోజుల పసికందు.. 90 గంటలు మృత్యువుతో పోరాడి గెలిచి..

Earthquake: శిథిలాల మధ్యలో.. గడ్డకట్టే చలిలో..ఆహారంలేని పరిస్థితుల్లో ఓ పది రోజుల పసికందు బతికి బయటపడింది. 90 గంటల పాటు జీవన్మరణ పోరాటం చేసి గెలిచింది. టర్కీలో సంభవించిన భూకంపంలో శిశువును, అతడి తల్లిని సహాయక సిబ్బంది రక్షించారు. ఈ ఘటన హతయ్‌ ప్రావిన్సులో చోటుచేసుకుంది.

ఈ పది రోజుల శిశువు పేరు యాగిజ్‌ ఉలాల్‌. తన తల్లితోపాటు శిథిలాల్లో చిక్కుకున్నాడు. అయితే సహాయకచర్యలు చేపడుతున్న సిబ్బందికి సిమెంట్ బిళ్లల మధ్య నుంచి చిన్నశబ్దం వినిపించింది. వెంటనే స్పందించిన సిబ్బంది ఆ బిడ్డను వెలికితీశారు. ఆ చలిలో చిన్నారిని ఒక థర్మల్‌ దుప్పటిలో చుట్టి ఆసుపత్రికి తరలించారు. అన్ని గంటలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ.. ఆ చిన్నారి చురుగ్గానే ఉన్నాడు. కానీ అతడి తల్లిని మాత్రం నీరసించిన దశలో గుర్తించారు. ప్రస్తుతం వీరిద్దరికి చికిత్స అందిస్తున్నారు.

టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది. మరణాలు 25 వేలు దాటాయి. ఇప్పటికే శిథిలాల కింది చిక్కినవారిలో ఎన్ని ప్రాణాలు నిలిచి ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు గడ్డకట్టే చలి ఉండటంతో ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. టర్కీ, సిరియా దేశాలకు భారత్‌ సహా ప్రపంచ దేశాలు తమ ఆపన్నహస్తం అందిస్తున్నాయి.

Tags:    

Similar News