Uganda: ఉగాండాలో దారుణం.. పాఠశాలలో విద్యార్థులపై ముష్కరుల దాడులు.. 41 మంది మృతి
Uganda: పలువురికి గాయాలు
Uganda: ఉగాండాలో దారుణం.. పాఠశాలలో విద్యార్థులపై ముష్కరుల దాడులు.. 41 మంది మృతి
Uganda: ఉగాండాలో మరణహోమం సంభవించింది. ఓ పాఠశాలలో తిరుగుబాటుదారులు దాడులు చేయడంతో 38 విద్యార్థులు సహా 41 మంది చనిపోవడం కలకలం సృష్టించింది. కాంగో సరిహద్దుకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంపాడ్వే పట్టణంలో లుబిరిహ సెకండరి స్కూల్‌లో అలయిడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ అనే తీవ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు దాడులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో 38 విద్యార్థులతో పాటు ఒక సెక్యూరిటీ గార్డు, ఇద్దరు స్థానికులు చనిపోయారు. ఈ విషయాన్ని ఎంపాడ్వే-లుబిపిహ మేయర్ సెల్వెస్ట్ మాపోజ్ వెల్లడించారు. ఈ దాడి జరిగిన అనంతరం సుమారు 6 మందిని తిరుగుబాటుదారులు ఎత్తుకెళ్లారని.. విద్యార్థుల ఆహారాన్ని కూడా దొంగిలించి పోరాస్ సరిహద్దు గూండా కాంగో లోపలికి పారిపోయినట్లు ఉగాండా మిలిటరీ అధికారులు పేర్కొన్నారు.
సుమారు 20 మంది తిరుగుబాటుదారులు.. విద్యార్థులు ఉంటున్న పాఠశాల వసతిగృహానికి నిప్పంటించారని మిలిటరీ అధికారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న దగ్గర్లోని సైనికులు ఘటనాస్థలానికి చేరుకున్నారని.. అప్పటికే కాంపౌండ్‌లో విద్యార్థులు మృతదేహాలు కనిపించినట్లు పేర్కొన్నారు. తిరుగుబాటుదారులు పాఠశాలకు నిప్పంటించినప్పుడు కొంతమంది విద్యార్థులకు తీవ్రమైన గాయాలు కాగా.. మరికొందరు విద్యార్థుల్ని కాల్చి చంపేశారు. అలాగే మరికొందర్ని కత్తులతో నరికి చంపినట్లు మేయర్ మాపోజ్ తెలిపారు. ఈ దుర్ఘటనలో పలువురు గాయపడగా.. ప్రస్తుతం వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.