కలవరపెడుతున్న మంకీపాక్స్‌.. ప్రపంచ వ్యాప్తంగా 20దేశాల్లో 200 కేసులు

WHO: కొత్త బాంబు పేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Update: 2022-05-28 08:59 GMT

కలవరపెడుతున్న మంకీపాక్స్‌ 

Monkeypox Cases: కరోనా వైరస్‌ నుంచి ఇప్పుడిప్పుడే ఊరటచెందుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో బాంబు పేల్చింది. మంకీపాక్స్ సామాజిక వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల్లో 200 పైగా మంకీపాక్స్‌ కేసులు బయటపడినట్టు వెల్లడించింది. వైరస్‌ కట్టడికి అవసరమైన సాయం అందజేస్తామని డబ్లబ్యూహెచ్‌వో తెలిపింది. ప్రపంచ దేశాలు తమ వద్ద పరిమితంగా టీకాలు, ఔషధాలను పంచుకునేందుకు ఓ నిల్వ కేంద్రాన్ని రూపొందించుకోవాలని ప్రతిపాదించింది. ఆఫ్రికా ఖండానికే పరిమితమైన ఈ వైరస్.. ఇప్పుడు పలు దేశాల్లో వైరస్‌ బయటపడుతుండడం దఢ పుట్టిస్తోంది. భారత్‌లో మాత్రం ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని భారత వైద్య పరిశోధన మండలి-ఐసీఎంఆర్‌ తెలిపింది.

మంకీపాక్స్‌ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. రోజురోజుకు వైరస్‌ విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 20దేశాల్లో సుమారు 200 కేసులు బయటపడినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ-డబ్ల్యూహెచ్‌వో తాజాగా వెల్లడించింది. అదే సమయంలో ఈ వైరస్‌ సామాజిక వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని కొత్త బాంబు పేల్చింది. అదే జరిగితే కరోనా వైరస్‌లా ప్రజలు భారీగా మంకీపాక్స్‌ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఐరోపా, ఆసియా పసిఫిక్‌, తూర్పు మధ్య ప్రాంతం, అమెరికా దేశాల్లో వైరస్‌ను గుర్తించినట్టు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అయితే ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని, భారీ టీకా కార్యక్రమం చేపట్టవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. మంకీపాక్స్‌ బాధితులను కలిసినవారు ఐసోలేషన్‌లో ఉంటే చాలని చెబుతోంది. ఐరోపా సమాఖ్య దేశాల్లో మంకీపాక్స్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన మందులను కొనుగోలు చేస్తున్నారు. స్వలింగ సంపర్కం ద్వారానే ఈ వ్యాధి ఐరోపాలో సోకినట్టు బ్రిటన్‌ ప్రకటించింది.

ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతున్న మంకీపాక్స్‌ను ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని భారత వైద్య పరిశోధన మండలి-ఐసీఎంఆర్‌ తెలిపింది. భారత్‌లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వివరించింది. మకీపాక్స్‌ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చిన వారిని పరీక్షించాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ అపర్ణ ముఖర్జీ చెప్పారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటే వారి నుంచి నమూనాలు సేకరించి.. నేషనల్‌ ఇన్‌స్టీట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ-ఎన్‌ఐవీకి పంపాలని అపర్ణ సూచించారు. మంకీపాక్స్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ వైరస్‌ మశూచిలాంటిదేనని.. దీని నుంచి ఎలాంటి ప్రమాదం లేదని ఆమె తెలిపారు. మంకీపాక్స్‌తో ఇప్పటివరకు ఎక్కడా ఎవరూ మృతి చెందలేదనే విషయాన్ని గుర్తు చేశారు. అందుకు అవసరమైన మందులు, వ్యాక్సిన్లు దేశంలో అందుబాటులో ఉన్నాయని డాక్టర్‌ అపర్ణ వివరించారు. 

Tags:    

Similar News