supreme Court: ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో జరిగిన సాయుధ దాడిలో ఇద్దరు సుప్రీంకోర్టు జడ్జీలు మరణించారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఇద్దరు జడ్జీలను కాల్చి చంపారు. మొహమ్మద్ మొగిషు, హోజతొలెస్లామ్ అలీ రైజిని అనే జడ్జీలు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. దాడిలో గాయపడ్డ మరో జడ్జికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. షూటింగ్ కు పాల్పడిన తర్వాత దుండగుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ఇద్దరు న్యాయమూర్తులు జాతీయ భద్రత, ఉగ్రవాదం.. గూఢచర్యం కేసులను విచారిస్తున్న సమయంలో వారిపై కాల్పులు జరిగాయి. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10:45 గంటలకు దాడి జరిగింది. మరణించినవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అలీ రజినీ, మొఘిషేగా గుర్తించారు. వారు ఇరాన్ న్యాయవ్యవస్థ సీనియర్ న్యాయమూర్తులుగా ఉన్నారు. అయితే దాడికి గల కారణాలు తెలియరాలేదు.పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దాడి చేసిన వ్యక్తి న్యాయ శాఖ ఉద్యోగిగా గుర్తించారు. ఇరాన్ ఇంటర్నేషనల్ ప్రకారం, టెహ్రాన్‌లోని కోర్టు హౌస్ నుండి చాలా మందిని అరెస్టు చేశారు. దాడి వెనుక కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
ప్రపంచంలో అత్యధిక మరణశిక్షలు విధించే దేశాల్లో ఇరాన్ ఒకటి . ఇరాన్‌లో 2024లో 901 మందికి మరణశిక్ష విధించారు. వీరిలో 31 మంది మహిళలు కూడా ఉన్నారు. గతేడాది డిసెంబర్‌లో ఒక్క వారంలో 40 మందికి మరణశిక్ష విధించారు.UN మానవ హక్కుల ప్రకారం, గత సంవత్సరం ఉరితీసిన వారిలో ఎక్కువ మంది మాదకద్రవ్యాలకు సంబంధించినవారు ఉండగా.. 2022లో మహ్సా అమిని మరణం తరువాత దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. మైనర్‌లకు మరణశిక్ష విధించకూడదని ఐక్యరాజ్యసమితి ఒప్పందంపై సంతకం చేసినప్పటికీ, ఇరాన్‌లో 9 ఏళ్ల బాలికలను కూడా ఉరితీస్తున్నారు.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం, ఇరాన్‌లో, 9 సంవత్సరాలు దాటిన తర్వాత బాలికలకు మరణశిక్ష విధించవచ్చు. అబ్బాయిలకు ఈ వయస్సు 15 సంవత్సరాలు. 2005, 2015 మధ్య, సుమారు 73 మంది పిల్లలకు మరణశిక్ష విధించింది. ఉరిశిక్ష పడిన ఇరాన్‌లోని ప్రతి యువకుడు ఉరిశిక్షకు చేరుకోవడానికి ముందు సగటున ఏడేళ్ల జైలు జీవితం గడుపుతారు. చాలా సందర్భాలలో ఇది 10 సంవత్సరాలు కూడా. అంతర్జాతీయ చట్టాల ప్రకారం, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తికి మరణశిక్ష విధించడంపై నిషేధం ఉంది.