శ్రీరాముడి జన్మస్థలం నేపాల్‌నేనా? – మరోసారి వివాదాలు రేపిన నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు | Nepal PM KP Sharma Oli Ram Janmasthan Statement
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి రాముడి జన్మస్థలం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు తమ దేశంలోనే జన్మించాడని, వాల్మీకి రామాయణ ఆధారంగా వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రీరాముడి జన్మస్థలం నేపాల్‌నేనా? – మరోసారి వివాదాలు రేపిన నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు | Nepal PM KP Sharma Oli Ram Janmasthan Statement
శ్రీరాముడు నేపాల్‌లోనే జన్మించాడని నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి (KP Sharma Oli) మరోసారి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ విదేశాల్లో చర్చకు దారితీశాయి. సోమవారం నేపాల్ రాజధాని కాఠ్‌మాండులో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘శ్రీరాముడు భారతదేశం కాదు.. నేపాల్‌వాడే’’ - ఓలి వ్యాఖ్యలు
‘‘వాల్మీకి మహర్షి రచించిన అసలైన రామాయణాన్ని పరిశీలిస్తే, రాముడి జన్మస్థలం నేపాల్ అని స్పష్టంగా తెలుస్తుంది. ఇది కొత్త విషయమేమీ కాదు. ప్రజలు దీనిని ధైర్యంగా ప్రచారం చేయాలి. రాముని జన్మస్థలం గురించి వేరే కథలు ఎలా సృష్టించగలరు?’’ అని ఓలి ప్రశ్నించారు.
ఇంకా మాట్లాడుతూ, ‘‘రాముడు పుట్టిన ప్రదేశం నేపాల్‌లోనే ఉంది. అది ఇప్పటికీ అక్కడే ఉంది. కానీ, మేము దాన్ని సరైన విధంగా ప్రపంచానికి చాటి చెప్పలేకపోతున్నాం. కొంతమందికి ఇది అసౌకర్యంగా ఉండొచ్చు. అయినప్పటికీ ఇది వాస్తవం’’ అని వ్యాఖ్యానించారు.
శివుడు, విశ్వామిత్రులు కూడా నేపాల్‌లోనే పుట్టారని ఒలీ ధీమా
ఈ సందర్భంలో ఓలి మరో సంచలన వ్యాఖ్య చేశారు. ‘‘శివుడు, విశ్వామిత్రుడు కూడా నేపాల్ దేశంలోనే పుట్టారు’’ అని పేర్కొన్నారు. ఇది తాను కాదని, వాల్మీకి రాసిన రామాయణంలోని సమాచారం ఆధారంగా చెబుతున్నానని వివరించారు.
గతంలోనూ ఇదే తరహా వివాదం
2020లో ఓలి ఇదే అంశంపై వివాదాస్పద ప్రకటన చేశారు. ‘‘అయోధ్య నేపాల్‌లోనే ఉంది. చిత్వాన్ జిల్లాలోని థోరిలో రాముడు జన్మించాడు’’ అని అన్నారు. దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన ప్రదేశం కూడా తమ దేశంలోనే ఉందని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
నేపాల్ విదేశాంగ శాఖ స్పష్టత
2020లో వచ్చిన ప్రతికూలతల నేపథ్యంలో, నేపాల్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఓలి చేసిన వ్యాఖ్యలు ఎవరి మనోభావాలను గాయపరచాలన్న ఉద్దేశంతో కాకపోయినా, ఇవి వ్యక్తిగత అభిప్రాయాలే అని పేర్కొంది. రామాయణానికి సంబంధించి మరింత సాంస్కృతిక, భౌగోళిక అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందని తెలిపింది.