Zero Tillage: వరి చేలల్లో మొక్కజొన్న సిరులు.. జీరోటిల్లేజ్ విధానంలో సత్ఫలితాలు..!

Maize with Zero Tillage: జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు సిద్ధిపేట జిల్లా రైతులు.

Update: 2023-02-22 05:27 GMT

Zero Tillage: వరి చేలల్లో మొక్కజొన్న సిరులు.. జీరోటిల్లేజ్ విధానంలో సత్ఫలితాలు..!

Maize with Zero Tillage: జీరో టిల్లేజ్ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు సిద్ధిపేట జిల్లా రైతులు. వరి కోసిన తర్వాత పొలంలో వరి కొయ్య కాళ్ళు ఉండగానే దుక్కి దున్నకుండా చదును చేసుకుని మొక్కజొన్న విత్తనాలను నేరుగా విత్తడాన్ని జీరో టిల్లెజ్ అంటారు. ఈ పద్దతి ద్వారా వరి చేనులో మొక్క జొన్న సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు సాగుదారులు. మొక్కజొన్న ఆహార పంటగానే కాకుండా, దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడి సరకుగాను ఉపయోగపడుతుండటంతో రైతులు అధిక విస్తీర్ణంలో పండిస్తూ లాభాలు గడిస్తున్నారు. వ్యవసాయాధికారులు యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగును ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా జీరోటిల్లేజ్ పద్ధతిపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

వరి తరువాత అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పంట మొక్కజొన్న. ఆహారపంటగానే కాకుండా పశువులకు మేతగా, దాణాగా వివిధ పరిశ్రమలో ముడిసరుకుగా వినియోగిస్తుండటంతో సిద్దిపేట జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా రబీలో వరి మాగాణుల్లో మొక్కజొన్నను జీరో టిల్లేజ్ విధానంలో ఇక్కడి రైతులు సాగు చేస్తున్నారు. ఖరీఫ్ వరి తరువాత దున్నకుండానే అదును చూసుకుని విత్తనాన్ని విత్తుతున్నారు. సాగు ఖర్చులను తగ్గించుకుని సమయాన్ని ఆదా చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు సాగుదారులు.

జిల్లాలోని అక్కన్నపేట మండల ప్రాంత రైతులు జీరో టిల్లేజ్ పద్ధతిలో వరి పండిస్తున్నారు. వరి కోసిన తర్వాత వరి కొయ్యలు పొలంలో ఉండగానే సరైన పదునులో విత్తనాలు వేసి మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. ఈ విధానం తమకు కలిసి వచ్చిందని సమయం ఆదా అవడంతో పాటు సాగు ఖర్చులు తగ్గాయని రైతులు తమ అనుభవాలను వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు తక్కువ విత్తనంతో అధిక దిగుబడి అందుతోందని తెలిపారు. బహిరంగా మార్కెట్లలోనూ మంచి ధర పలుకుతోందని ఈ విధానంలో మొక్కజొన్న సాగు లాభదాయకంగా ఉందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

యాసంగిలో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉండటంతో వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగును ప్రోత్సహిస్తున్నారు వ్యవసాయాధికారులు. అందులో భాగంగా జీరో టిల్లేజ్ పద్ధతిపై రెండేళ్లుగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ పద్ధతిలో మొక్కజొన్న సాగు చేయడం వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయని వ్యవసాయాధికారులు తెలియజేస్తున్నారు. నీరు ఆదా అవ్వడంతో పాటు, వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చన్నారు. అయితే ఈ విధానంలో కలుపు సమస్య ఉంటుందని అంటున్నారు అధికారులు. కలుపును సకాలంలో నివారిస్తే రైతులు లాభాలు పొందవచ్చంటున్నారు. 

Full View


Tags:    

Similar News