Terrace Gardening: మిద్దె సాగులో రాణిస్తున్న ఉప్పల్‌కు చెందిన మమత

Terrace Gardening: ఉప్పల్ లోని మేడిపల్లి ప్రాంతానికి చెందిన మమత ఓ గృహిణి.

Update: 2021-07-05 06:46 GMT

Terrace Gardening: మిద్దె సాగులో రాణిస్తున్న ఉప్పల్‌కు చెందిన మమత

Terrace Gardening: ఉప్పల్ లోని మేడిపల్లి ప్రాంతానికి చెందిన మమత ఓ గృహిణి. గృహిణే అంటూ తేలికగా తీసుకోకండి. తన తెలివితేటలతో గృహాణ్ని ఓ ఉద్యాన క్షేత్రంగా మార్చి తన కుటుంబానికి ఆరోగ్య భరోసాను కల్పిస్తోంది. మొక్కల పెంపకం అంటే మమతకు ఇష‌్టం కానీ అనుభవం లేదు. సమాజిక మాధ్యమాలే ఆమెకు స్ఫూర్తిగా నిలిచాయి. మిద్దె సాగులో విజయాలు సాధిస్తున్న వారి సలహాలు సూచనలు అనుసరించి పూల మొక్కలతో మిద్దె సాగుకు ఆరేళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. రసాయనాలు లేని ఆహారాన్ని పండించాలనుకున్న మమత మొదట ఆకుకూరల సాగు చేపట్టారు. అలా కూరగాయలు, పండ్లను కుటుంబ సభ్యుల సహకారంతో మేడమీదే పెంచుతూ ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తుల దిగుబడులను అందుకుంటున్నారు.

ప్రకృతితో స్నేహం ఎలా చేయాలో మిద్దె తోట మనకు నేర్పిస్తుందని ప్రకృతిని మనం ప్రేమిస్తే అది మనల్ని ప్రేమిస్తుందని అంటున్నారు మమత. అందుకే తన పిల్లలకు ప్రకృతి దగ్గర చేస్తున్నానని అంటున్నారు. ఇక ప్రతి రోజు ఇంటి పనులు పూర్తి కాగానే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మిద్దె తోటలోని మొక్కలతోనే కాలక్షేపం చేస్తానని అంటున్నారు మమత. తద్వారా మానసిక ఉల్లాసం లభిస్తోందని తెలిపారు.

మిద్దె తోటలో ఆకుకూరలు, కాయగూరలతో పాటు చాలా అరుదుగా లభించే పండ్ల మొక్కలను పెంచుతున్నారు. చిన్న చిన్న కుండీలకు కొత్త హంగులను అద్దుతూ తమ గార్డెన్ ని మరింత అందంగా తయారు చేసుకుంటున్నారు మమత. ప్రత్యేక వాతావరణంలో పెరిగే డ్రాగన్ ప్రూట్ నీ కూడా వీరి మిద్దె తోటలో సాగు చేస్తున్నారు. గతంలో పండ్ల ను మార్కెట్ నుంచి కొనుగోలు చేసేవారమని కానీ గత మూడేళ్లుగా మార్కెట్ అవసరం రాలేదని మేడమీదే ఎంతో రుచికరమైన పండ్లను సీజన్ వారీగా తినగలుగుతున్నామని చెబుతున్నారు ఈ మిద్దె సాగుదారు.

మమత గారి మిద్దె తోటలో చీడపీడలు ఆశించడం చాల తక్కువగా కనిపిస్తుంది. ఒక వేళ వచ్చినా ప్రకృతి పద్ధతుల్లో, సేంద్రియ మిశ్రమాలతో సులభంగా నివారిస్తున్నారు ఆమె. మొక్కల పెంపకంలో పోషకాలు అందించే మట్టి మిశ్రమం బలంగా ఉంటే మొక్కల్లో వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉంటుందంటున్నారు. ఆ మిశ్రమం కోసం తోటలో రాలిపోయిన ఆకులు, వంటింటి వ్యర్థాలు , కోకోపిట్, వర్మికంపోస్ట్‌, ఎర్రమట్టిని వాడుతున్నారు. అదే విధంగా మట్టిలో ఫంగల్ రాకుండా, ఆరోగ్యకరమైన ఉత్పత్తి తీసేందుకు సూడోమోనస్, ట్రైకోడెర్మా విరిడిని వినియోగిస్తున్నారు. పుల్లటి మజ్జిగ, నీమ్ ఆయిల్, వేస్ట్ డీకంపోసర్ వంటి వాటిని చీడపీడలు ఆశించకుండా ముందే మొక్కకు అందిస్తే మొక్కకు బలం అందుతుందంటున్నారు. ప్రకృతి, సేంద్రియ విధానంలో మొక్కలు పెంచడం తనకు ఎంతో సంతృప్తిని అందిస్తుందంటున్నారు మమత.

టెర్రస్ గార్డెన్ అనేసరికి చాలా మందికి అనేక అనుమానాలు, అపోహలు ఉంటాయి. పెద్ద మొత్తంలో మొక్కలు సాగు చేసుకుంటే స్లాబ్ పాడవుతుందని భావిస్తుంటారు. స్లాబ్ పాడవకుండా తక్కువ ఖర్చుతో ఎంతో సులుభంగా మొక్కలు పెంచుకోవచ్చని అంటున్నారు మమత. మొక్కల పెంపకానికి ఉపయోగించే కంటైనర్‌ల ఎంపికలోనూ పొరపాట్లు చేస్తుంటారని చెబుతున్నారు. గ్రోబ్యాగులను ఉపయోగించడం వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయని అంటున్నారు. దీర్ఘకాలంగా ఉండే ప్లాస్టిక్ డ్రమ్ములు , టబ్బులను ఎన్నుకోవాలని సూచిస్తున్నారు. వాటని ఓ క్రమ ప్రకారం అమర్చేందుకు స్టాండ్‌లను ఏర్పాటు చేసుకుంటే సులువుగా తోట పనులను చేసుకోవడం తో పాటు స్లాబ్ పాడవదంటున్నారు. మిద్దె తోటల ద్వారా స్వచ్ఛమైన గాలిని ఇంటి వద్దే పొందవచ్చు. డాబా మీదే ఎన్నో ఆకర్షణీయమైన మొక్కలు, పండ్లు, కూరగాయలను పెంచుతూ ఆరోగ్యంగా ఉండవచ్చు. హాస్పిటళ్లకు పెట్టే ఖర్చును నియంత్రించుకోవచ్చు. ఆ దిశగా అందరూ మిద్దె సాగుకు శ్రీకారం చుడతారని ఆశిద్దాం.

Full View


Tags:    

Similar News