Organic Farming: ప్రకృతి విధానంలో ఆకుకూరల సాగు

Organic Farming: అందరు రైతుల మాదిరిగానే ముందు రసాయనాల సేద్యం చేశారు. అందులో నష్టాలు తప్ప లాభాలు లేవని గ్రహించారు.

Update: 2022-02-02 12:00 GMT

Organic Farming: ప్రకృతి విధానంలో ఆకుకూరల సాగు

Organic Farming: అందరు రైతుల మాదిరిగానే ముందు రసాయనాల సేద్యం చేశారు. అందులో నష్టాలు తప్ప లాభాలు లేవని గ్రహించారు. ప్రత్యామ్నాయ పద్ధతుల్లో సేద్యం చెయ్యాలని భావించారు. గో ఆధారిత సేద్యం ఆకర్షించడంతో ఆ దిశగా అడుగులు వేశారు. ప్రస్తుతం తక్కువ పెట్టుబడితో కూలీలపై పెద్దగా ఆధారపడకుండా ఆకుకూరలను పండిస్తూ లాభదాయకమైన ఆదాయం పొందుతున్నారు ఖమ్మం జిల్లాకు చెందిన రైతు సుధాకర్ రెడ్డి. తనకున్న నాలుగున్నర ఎకరాల భూమిలో వివిధ రకాల ఆకుకూరలను పండిస్తూ ప్రతి రోజు నికర ఆదాయాన్ని పొందుతున్నారు. రసాయనాలు లేని ఆకుకూరలు కావడంతో వినియోగదారులు ఈ ఆకుకూరలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్‌పై ఆధారపడకుండా తానే సొంతంగా ఆకుకూరలను విక్రయించడంతో పాటు గోఆధారిత వ్యవసాయం గురించి ప్రచారం నిర్వహిస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు సుధాకర్ రెడ్డి.

ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం కందుకూర్ గ్రామానికి చెందిన రైతు బండి సుధాకర్ రెడ్డి గత 12 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. ప్రారంభంలో రసాయనాలను ఉపయోగించి ఆకుకూరలు పండించేవారు ఈ సాగుదారు. అయితే రసాయనాల సేద్యంలో పెద్దగా కలిసివచ్చింది ఏమీ లేదని గుర్తించి ఆనోట ఈనోట విన్న గోఆధారిత సేద్యం వైపు ఆసక్తిని మళ్లించుకున్నారు. గత 8 ఏళ్లుగ్గా ప్రకృతి సిద్ధంగా ఆకుకూరలను పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

తనకున్న నాలుగున్నర ఎకరాల భూమిలో కొత్తిమీర, తోటకూర, పూదీన, గోంగూర, పాలకుర, మెంతి ఇలా వివిధ రకాల ఆకుకూరలు సాగు చేస్తున్నారు. ప్రకృతి విధానంలో ఆకుకూరలు సాగు చేయాలనుకునే వారు మొదటగా పొలాన్ని దుక్కి దున్ని ఘనజీవామృతం చల్లి నిరు పెట్టి మడులుగా చెయ్యాలన్నారు సుధాకర్. విత్తనాలు నాటుకున్న తరువాత పది రోజులకు ఒకసారి జీవామృతం, వేపకాషాయాన్ని పిచికారీ చేయాలని తెలిపారు. ఇలా చేయడం వల్ల చీడపీడలు గుడ్డు దశలోనే నాశనం అవుతాయని, పంటంతా ఆరోగ్యంగా పెరుగుతుందని సుధాకర్ చెబుతున్నారు.

ప్రకృతి పద్ధతిలో పంట పండించాలంటే రైతుకు ఓపిక చాలా అవసరం అని అదే ప్రధాన సూత్రం అని అన్నారు సుధాకర్. ఇదే అకుకూరలను రసాయనాల ద్వార పండిస్తే 20 రోజులకు దిగుబడి వస్తుందని , ప్రకృతి విధానంలో అయితే 40 రోజులకు దిగుబడి అందుతుందన్నారు. కేవలం 5 వేల రూపాయల పెట్టుబడితో నాణ్యమైన పంటను ఈ విధానంలో పొందవచ్చని తెలిపారు. ప్రతి రోజు 2 నుంచి 3 వేల ఆదాయం నికరంగా వస్తోందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా ఉధృతి కారణంగా ప్రస్తుతం కళాశాలలు మూతపడటంతో ఉన్నత చదువులు చదువుకుంటున్న సుధాకర్ పిల్లలు కూడా సేద్యం పనుల్లో కాస్త చేదోడువాదోడుగా ఉంటున్నారు. మార్కెట్‌పై ఆధారపడకుండా పంట చేతికి వచ్చిన వెంటనే స్థానికంగా ఉన్న గ్రామాలకు వెల్లి ఆకుకూరలను విక్రయిస్తున్నారు సుధాకర్. ప్రకృతి విధానంలో పండిన ఆకుకూరలు కావడంతో వినియోగదారులు ఈ ఆకుకూరలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

Full View


Tags:    

Similar News