Coco Farming: రైతుకు లాభాలు అందిస్తున్న కోకో పంట

Cocoa Farming: అంతర పంటల సాగుకు కొబ్బరి తోటలు రైతుల పాలిట కల్పతరువుగా మారాయి.

Update: 2023-02-07 09:46 GMT

Coco Farming: రైతుకు లాభాలు అందిస్తున్న కోకో పంట..!

Cocoa Farming: అంతర పంటల సాగుకు కొబ్బరి తోటలు రైతుల పాలిట కల్పతరువుగా మారాయి. కానీ చాలా మంది రైతులు అంతర పంటల సాగు పట్ల అవగాహన లేకపోవడంతో ఎంతో ఆదాయాన్ని కోల్పోతున్నారు. పాక్షిక నీడను ఇచ్చే కొబ్బరి తోటల్లో ఎన్నో రకాల వాణిజ్య పంటలను పండించుకోవచ్చు. ఇది రైతుకు అన్ని విధాలా కలిసివచ్చే అవకాశం. ఆ అవకాశాన్నే సద్వినియోగం చేసుకుని ప్రధాన పంటకు ధీటుగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రైతు. గత కొంత కాలంగా ప్రకృతి వైపరీత్యాలకు కొబ్బరి తోటలు దెబ్బతినడం, చీడపీడల సమస్యలు అధికమవడంతో కోకో పంట రైతును ఆదుకుంటోంది.

శ్రీకాకుళం జిల్లా అంటే గుర్తుకు వచ్చేది ఉద్దాన ప్రాంతం. కోనసీమను తలపించే రీతిలో ఇక్కడ కొబ్బరి సాగు జరుగుతుంది. ఒకప్పుడు కొబ్బరి సాగు రైతుకు లాభదాయకంగానే ఉన్నా.. గత ఐదు సంవత్సరాలుగా కొబ్బరి రైతులు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జిల్లాలో అధిక వర్షాలు, తుఫానులు ఏర్పడటం, చీడపీడల సమస్యలు వేధిస్తుండటంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు చూస్తున్న తరుణంలో ఉద్యానాధికారుల సూచనల మేరకు అంతర పంటల సాగు వైపు అడుగులు వేస్తున్నారు. కవిటి మండలానికి చెందిన రైతు వెంకటేశ్వరరావు తనకున్న కొబ్బరి తోటలో కోకోను అంతర పంటగా పండిస్తూ చక్కని ఆదాయన్ని అందిపుచ్చుకుంటున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

కోకో పంట సాగుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని రైతే ఆడుతూ పాడుతూ సాగు చేసుకోవచ్చని రైతు వెంకటేశ్వరరావు చెబుతున్నారు. మిగతా పండ్ల తోటల్లో మాదిరిగా ఈ తోటకు తెల్లదోమ సమస్యే ఉండదంటున్నారు. అందులోనూ పూర్తి గో ఆధారిత సేద్యం చేస్తుండటంతో కాయ దిగుబడి బాగుందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోకోతో పాటు కొబ్బరి తోటలో అరటి, జీడిమామిడి, పంటలు పండిస్తున్నారు ఈ సాగుదారు. ఈ పంటల నుంచి రాలిన ఆకులతో నేలలో సేంద్రియ కర్బనం శాతం పెరుగుతోందని దిగుబడి లాభదాయకంగా వస్తోందని అంటున్నారు. ప్రధాన పంట ఆదాయంతో పాటు అంతర పంటలతో అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తూ రైతు లాభాల మార్గంలో ప్రయాణిస్తున్నారు. ఆసక్తి ఉన్న రైతులకు పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తానంటున్నారు.

కేజీ రెండు వందల రూపాయలకు కంపెనీకే పంటను విక్రయిస్తున్నారు రైతు. రవాణా ఖర్చులు పోను రైతుకు 185 రూపాయలు మిగులుతుందని ఈ సాగుదారు తెలిపారు. పెట్టుబడి ఖర్చులు పోను ఈ పంట ద్వారా 50 నుండి 70 వేల వరకు ఆదాయం వస్తుందన్నారు. రైతులకు అధికారులు మరింత అవగాహన కల్పిస్తే అధిక దిగుబడులను సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

Full View


Tags:    

Similar News