Terrace Gardening Ideas: మిద్దె సాగులో రాణిస్తున్న రిటైర్డ్ ఉద్యోగి

Terrace Gardening Tips: ఆయన ఓ రచయిత. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి.

Update: 2021-05-28 09:54 GMT

Terrace Gardening: మిద్దె సాగులో రాణిస్తున్న రిటైర్డ్ ఉద్యోగి

Terrace Gardening Ideas: ఆయన ఓ రచయిత. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. వ్యవసాయంతో ఆయనకు చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే ఉద్యోగ రిత్యా రిటైర్మెంట్ తీసుకున్న వీరగోని పెంటయ్య పచ్చటి మొక్కల మధ్య బిజీ బిజీగా గడుపుతున్నారు. మొక్కలపై మమకారం పెంచుకుంటూ మిద్దె తోట పనుల్లో నిమగ్నమై ఆహ్లాదరకమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు.

గతంలో ఉద్యోగ బాధ్యతలతో తీరికలేని సమయం గడిపారు కరీంనగర్ లోని భగత్ నగర్‌కు చెందిన పెంటయ్య. ఉద్యోగరిత్యా రిటైర్ అయిన తరువాత ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకున్నారు. పల్లెల్లో పచ్చటి మొక్కల మధ్య గడిపిన పెంటయ్యకు సిటీలోనూ పల్లె వాతావరణాన్ని సృష్టించాలని నిర్ణయానికి వచ్చారు. అంతే కాదు రసాయనల వాడకంతో రుచిపచీలేని కూరగాయలు తినకుండా స్వయంగా పండించాలనుకున్నారు. సొంతిటిపైన తమ ఇంటికి కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు పండించాలనుకున్నారు. మిద్దెతోటల నిర్వహణ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన తెచ్చుకున్నారు. శాశ్వత మడులను ఏర్పాటు చేసుకుని మొద్దె సాగుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ప్రకృతి ఒడిలో సేదదీరుతూ ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారు.

మిద్దెతోటలను సాగు చేసేటప్పుడు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. వాటిని పరిష‌్కరించుకుంటూ మేడ మీద బంగారు పంటలను పండిస్తున్నారు పెంటయ్య. మేడ మీద ఉన్న స్థలాన్ని బట్టి స్లాబ్ పాడవ్వకుండా మొక్కలు ఆరోగ్యకరంగా పెరిగే విధంగా శాశ్వతంగా పెద్ద పెద్ద మడులను నిర్మించుకున్నారు. మొక్కలకు అనువుగా మడులను ఏర్పాటు చేసుకున్నారు. డాబా మీద మొత్తం 11 సిమెంట్ మడులను చతురస్రాకారంలో నిర్మించుకున్నారు. ఐదేళ్ల క్రితం కేవలం 25 వేల రూపాయల ఖర్చుతో మడులు ఏర్పాటు చేసుకున్నారు. సారవంతమైన మట్టిని మడుల్లో నింపి సేంద్రియ ఎరువులను సేకరించి రకరకాల కూరగాయలు, ఆకుకూరలు పెంచుతున్నారు. సొరకాయ, బీరకాయ, వంకాయ, మిరపకాయ తోపాటు తోటకూర, చుక్కకూర, పాలకూర, గోంగూర మొదలగు ఆకుకూరలు డ్రాగన్ ఫ్రూట్ , మామిడి, బొప్పాయి వంటి పండ్ల మొక్కలను పెంచుతున్నారు.

మార్కెట్‌లో కొంటున్న ఆకుకూరలు, కూరగాయల్లో రుచి ఉండదు. మందులు కొట్టి పండించే ఈ తిండి తింటే ఆరోగ్యం ఏమవుతుందో అని అందోళన చెందని పట్టణవాసులు వుండరు. సిటీలో మన ఇంట్లోనే మనం తినే కూరగాయలను మనమే పండించుకుంటే రుచికరమైన కూరగాయలతో పాటు కొండంత సంతృప్తి కూడా మన సొంతం అవుతుందంటున్నారు పెంటయ్య.

మొక్కలకు కావలసిన పోషకాలను అందించేందుకు ప్రకృతి ఎరువులనే వినియోగిస్తున్నారు పెంటయ్య. ఆ ఎరువును సొంతంగా మేడ మీదే తయారు చేసుకుంటున్నారు. మిద్దె తోటల నుంచి రాలిన ప్రతి ఆకును రీసైకిల్ చేసి దానిని ఎరువుగా సిద్ధం చేసుకుంటున్నారు. గొర్రెల ఎరువును మేడమీద నిల్వ చేసుకుని సమయానుకూలంగా వినియోగిస్తుంటారు. ఇక మొక్కలు చీడపీడల బారినపడకుండా చక్కటి ద్రావణాలను పిచికారీ చేస్తున్నాడు. అల్లం, వెల్లుల్లి, బెల్లం తో తయారు చేసిన ద్రావణాలు చక్కని క్రిమిసంహారగాలుగా పనిచేస్తాయని మొక్కల్లో చీడపీడలను సమర్థవంతంగా నివారిస్తున్నాయని ఈ మిద్దె సాగుదారు చెబుతున్నారు. ఇక వేపనూనెలను వినియోగిస్తున్నామంటున్నారు. ఎలాంటి రసాయనాలు, పురుగుమందులు వాడకుండా పండిన ఆహారం కావటంతో ఎంతో రుచిగా ఉంటాయంటున్నారు.

మిద్దెతోటలు పెంచడం చక్కటి శారీరక వ్యాయామ ప్రక్రియని అంటారు పెంటయ్య. ఉదయం సాయంత్రం రెండు గంటల సమయం మిద్దె తోట పనుల్లో శ్రమిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని అంటున్నారు. చల్లటి, ఆహ్లాదకరమైన వాతావరణంలో తాము నిత్యం వ్యాయామాలు, యోగా చేస్తామని చెబుతున్నారు. వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న ప్రస్తుత క్రమంలో విద్య తోటల సాగు అనేది ఒక బృహత్తర ప్రక్రియ అంటారు పెంటయ్య. తద్వారా ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారంటున్నారు. ఈ మెద్దె తోట ద్వారా మార్కెట్ కు వెళ్లే పని తప్పిందంటున్నారు పెంటయ్య. ఇంటికి సరిపడా కూరగాయలు సమృద్ధిగా లిభిస్తున్నాయని అప్పుడప్పుడూ మిత్రులకు , బంధువులకు అందిస్తూ ఆరోగ్యాన్ని పంచుతున్నామంటున్నారు.

నేటితరం యువకులు యంత్రాలకు బానిసలవుతున్నారు. ప్రకృతితో మమేకమై గడపాల్సిన బాల్యాన్ని నాలుగు గోడల మధ్య ఫోన్‌లకు , టీవీలకు, అతక్కుపోతున్నారు. ప్రకృతి విషయం పక్కన పెడితే పక్కవాడి విషయం కూడా తెలుసుకోలేని పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. ఆహార విషయంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. చిన్నవారి నుంచి పెద్ద వారి వరకు ఎన్నో అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లకు ప్రకృతిపై మమకారాన్ని పెంచే విధంగా మిద్దె తోటల సాగుకు శ్రీకారం చుట్టాలని సూచిస్తున్నారు. తద్వారా ఆహారం, ఆరోగ్యం, పర్యావరణం పట్ల అవగాహన పెరుగుతుందని చెబుతున్నారు.

ఒక్కసారి పెట్టుబడి పెడితే సూదీర్ఘకాలం మిద్దె సాగు ద్వారా ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు ఈ సాగుదారు. ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం సొంతమవుతుందంటున్నారు. శారీరక శ్రమతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందంటున్నారు. తమ కుటుంబాన్ని మాయదారి వైరస్‌ల నుంచి రక్షించుకోవాలనుకునే ప్రతి ఒక్కరు మిద్దె తోటలను సాగుకు శ్రీకారం చుట్టాలంటూ పిలుపునిస్తున్నారు.  

Full View


Tags:    

Similar News