Organic Farming: ప్రధాని మెచ్చిన మహిళా రైతు

Organic Farming: మగువా... మగువా.. లోకానికి తెలుసా నీ విలువ... మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అన్న సినీ పాటను నిజం చేస్తూ తానేమిటో ప్రపంచానికి చాటింది ఆ మహిళ రైతు.

Update: 2021-05-21 06:06 GMT

Organic Farming: ప్రధాని మెచ్చిన మహిళా రైతు

Organic Farming: మగువా... మగువా.. లోకానికి తెలుసా నీ విలువ... మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అన్న సినీ పాటను నిజం చేస్తూ తానేమిటో ప్రపంచానికి చాటింది ఆ మహిళ రైతు. భర్త మరణంతో ఒంటరిగా ఉంటున్న ఆదివాసీ స్త్రీ తనకు సంక్రమించిన భూమిలో అద్భుతాలు సృష్టిస్తోంది. దేశ ప్రధానితోనే శభాష్ అనిపించుకొని పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. ప్రకృతి వ్యవసాయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడిస్తూ దేశానికే గర్వకారణమైంది. కరవు సీమ అనంతలో సిరుల పంటలు పండిస్తున్న మహిళా రైతు వన్నూరమ్మపై ప్రత్యేక కథనం.

అక్షరం ముక్క రాకపోయినా... భర్త మరణించినా ఒంటరినన్న అభద్రత లేకుండా మొక్కవోని ధైర్యంతో వారసత్వంగా తనకు సంక్రమించిన భూమిలో బంగారు పంటలు పండిస్తోంది ఈ మహిళా రైతు. నవధాన్యాలు సాగు చేసి అధిక దిగుబడులు సాధిస్తోంది. బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటూ సేద్యంలో వారికి మెలుకువలు నేర్పుతూ లాభాలు ఆర్జించే విధంగా తన వంత సాయం చేస్తోంది. ఈమె ప్రతిభను తెలుసుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలతో ముంచెత్తారు. దేశానికి ఆదర్శం అంటూ కొనియాడారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురద కుంట గ్రామానికి చెందిన మహిళా రైతు వన్నూరమ్మకు ప్రభుత్వం నుంచి నాలుగు ఎకరాల భూమి సంక్రమించింది. 1994 సంవత్సరంలో ప్రభుత్వం సాగు చేసుకోవడానకి ఇచ్చిన భూమి అయినప్పటికీ పెద్దగా పంటలు పండక చాలా రోజులు బీడుగా ఉండేది. గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై 2018లో తొలిసారిగా అధికారులు సాగు పై అవగాహన కల్పించారు. అక్కడే వన్నూరమ్మ జీవితం లో ఆశలు చిగురించాయి. ఈ విధానంలో తమ బీడు భూమిని సాగుచేయాలని సంకల్పించిన వన్నూరమ్మ పట్టుదలతో నాలుగు ఎకరాలు సాగులోకి తీసుకొచ్చింది.

అధికారుల సాయంతో ప్రకృతి విధానంలో పంటలు సాగు చేసింది. సాంప్రదాయంగా సాగు చేసే వేరుశనగతో పాటు నవధాన్యాలు, కూరగాలయల సాగుకు శ్రీకారం చుట్టింది. పూర్తి ప్రకృతి వ్యవసాయం కావడంతో ఆశించిన దిగుబడులు అందివచ్చాయి. తొలి ఏడాది 27 వేల రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంటలకు గాను అక్షరాల లక్షా 7 వేల రూపాయల ఆదాయం వచ్చిందని చెబుతోంది ఈ వన్నూరమ్మ. అధికారులు అందించిన సూచనలు, సలహాలతోనే తక్కువ ఖర్చులతో ఏటా లక్షల్లో ఆదాయం గడిస్తూన్నట్లు వన్నూరమ్మ హర్షం వ్యక్తం చేస్తోంది.

ప్రకృతి వ్యవసాయతో లాభాలు గడిస్తూన్న వన్నూరమ్మ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది. తోటి వారిని ఈ సాగు వైపు ప్రోత్సహించేందుకు పాటుపడుతోంది. పొరుగున ఉన్న వంక తండాలో ఉన్న 170 మంది గిరిజన మహిళలకు ప్రకృతి వ్యవసాయంపైన అవగాహన కల్పించింది. సుమారు 220 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేసే విధంగా వారిని ప్రోత్సహించింది.

సాధారణ పద్దతులను అనుసరిస్తూ ప్రకృతి సేద్యం చేస్తూ అధిక లాభాలు గడిస్తూ ఆదర్శంగా నిలుస్తూన్న వన్నూరమ్మను పలు అవార్డులు వరించాయి. దేశ ప్రధాని స్వయంగా ఆమెతో మాట్లాడారు. పీఎం కిసాన్ నిధి నిధుల విడుదల సందర్భంగా ఆమెతో ముచ్చటించారు. ఆమె సాగు తీరుతెన్నులు తెలుసుకుని ఆమెను ప్రశంసించారు. వన్నూరమ్మ సేవలు దేశానికి ఆదర్శమని కొనియాడారు.

ప్రకృతి వ్యవసాయంలో అనంతపురం ఆదర్శంగా నిలుస్తోందని ప్రధాని నరేంద్రమోడీ కొనియాడారు. వన్నూరమ్మ వంటి ఎందరో రైతులు జిల్లాలో పంటలు సాగుచేస్తూ కీలకంగా మారుతున్నారు. ఇప్పటికే పండ్లతోటల సాగులో ప్రసిద్ధి గాంచిన అనంతపురం జిల్లాలో రైతాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సరైన ప్రోత్సాహకాలు అందిస్తే మరింతంగా రాణిస్తారని జిల్లా వాసులు కోరుతున్నారు. ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Full View


Tags:    

Similar News