Palm Oil Cultivation: ఉపాధ్యాయ వృత్తిని వీడి సాగువైపు పయనం

Palm Oil Cultivation: ఒకసారి నాటితే 35 ఏళ్ల వరకు దిగుబడి.

Update: 2021-10-19 11:02 GMT

Palm Oil Cultivation: ఉపాధ్యాయ వృత్తిని వీడి సాగువైపు పయనం

Palm Oil Cultivation: ఒకసారి నాటితే 35 ఏళ్ల వరకు దిగుబడి. తక్కువ ఖర్చు , తక్కువ శ్రమ తో నాణ్యమైన పంట 75 శాతం వరకు కూలీల అవసరం ఉండదు నాటిన నాలుగో ఏట నుంచి దిగుబడి పంటను అమ్ముకునేందుకు ఆపసోపాలు పడనవసరం లేదు. ప్రతి నెల స్థిరమైన ఆదాయాన్ని అందుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని కాబట్టే ఉపాధ్యాయ వృత్తిని వీడి సంప్రదాయ పంటలకు భిన్నంగా ప్రయోగాత్మకంగా పామాయిల్ సాగు చేస్తున్నారు చిత్తూరు జిల్లా, శ్రీకాళహస్తి మండలం, టీఎంవీ కండ్రిక గ్రామానికి చెందన రైతు బత్తిరెడ్డి. తండ్రి నుంచి సంక్రమించిన కొంత పొలంతో పాటు తాను కొనుగోలు చేసిన 15 ఎకరాల పొలంలో పూర్తిస్థాయిలో పామాయిల్ పండిస్తున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

గతంలో వరి, వేరుశనగ, చెరకు, పత్తి వంటి పంటలను సాగు చేశారు బత్తిరెడ్డి. అయితే ఈ పంటలను స్వయంగా మార్కెట్ చేసుకోవాల్సి రావడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని రైతు చెబుతున్నారు. అన్ని కష్టాలను ఎదుర్కొని పంటను అమ్ముకున్నా గిట్టుబాటు ధర రాక నష్టాలు ఎదురయ్యాయని తెలిపారు. ఈ క్రమంలో సంప్రదాయేతర పంటలను సాగు చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. పామాయిల్ సాగు చేసుకుంటే మార్కెట్ సమస్య ఉండదని , కంపెనీలే ఒప్పందం చేసుకుని పంటను కొనుగోలు చేస్తాయంటున్నారు బత్తిరెడ్డి. ప్రభుత్వం సైతం రాయితీలు అందిస్తుందని తెలిపారు. తనతో పాటు నాలుగు మండలాల్లో 70 ఎకరాల్లో పామియిల్ సాగులో ఉందన్నారు.

పామాయిల్ గెలల దిగుబడి మీద వాతావరణ ప్రభావం ఏమీ ఉండదని రైతు స్పష్టం చేస్తున్నారు. వాతావరణ సమతుల్యం దెబ్బతినదంటున్నారు. వేసవి కాలంలో నీటి తడులను అందిస్తూ సరైన ఎరువుల యాజమాన్యం పాటిస్తే ఎకరాకు 10 టన్నుల వరకు దిగుబడి వస్తుందన్నారు. జనవరి నెల నుంచి తొలకరి వచ్చే వరకు నేలలో తేమ ఉండే విధంగా జాగ్రత్తగా పంటను గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తే చెట్టు ఎదుగుతుందే కానీ దిగుబడి తగ్గుతుందంటున్నారు. పెద్దమొత్తంలో నీరు అవసరం లేకున్నా డ్రిప్పు ద్వారా నీరు అందిస్తే సరిపోతుందని తెలిపారు.

పామాయిల్ ఒకసారి నాటితే 35 ఏళ్ల వరకు దిగుబడిని అందిస్తుంది. అయితే ఈ 35 ఏళ్లు రసాయనాలను వాడటం వల్ల నేల భౌతిక స్వరూపం మారిపోతుందని గ్రహించి పూర్తి ప్రకృతి విధానంలోనే పామాయిల్‌ను సాగు చేస్తున్నారు బత్తిరెడ్డి. పాలేకర్ సూచించిన పద్ధతుల్లోనే పంటను పెంచుతున్నారు. ప్రస్తుతం పంట వయస్సు మూడేళ్లు. వచ్చే ఏడాది నుంచి దిగుబడి అందివస్తుందని రైతు చెబుతున్నారు. నాలుగో ఏటలో ప్రతి నెల గెలల దిగబడి వస్తుందని ఐదో ఏట నుంచి ప్రతి 15 రోజులకు పంట కోతకు వస్తుందని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో టన్ను ఆయి‌ల్‌పామ్ గెలల ధర 18వేల వరకు ఉందని ఎకరాకు పది టన్నుల దిగుబడి వచ్చినా ప్రతి నెల రైతుకు నికరంగా లక్ష రూపాయల వరకు ఆదాయం పొందవచ్చని చెబుతున్నారు. ఉద్యాన పంటల్లో ఆదాయపరంగా మేలైన పంటల పామాయిల్ అని రైతు చెబుతున్నారు.

పామాయిల్ తోటలకు ప్రభుత్వం రాయితీలను అందిస్తోంది. మొక్కకు 90 రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తోంది. ఎకరాకు 57 చెట్లు పెట్టినప్పుడు వెయ్యి రూపాయలు రైతు పెట్టుకుంటే మిగతాది ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. కోత రావడానికి నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది కాబట్టి ఆ నాలుగేళ్లు అంతర పంటల సాగుకు ఎరువులకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తోందని రైతు చెబుతున్నారు. 

Full View


Tags:    

Similar News