Terrace Garden: ఆర్గానిక్ మిద్దె తోటలు

Terrace Garden: రసాయనిక అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలన్న ఆలోచనతో నగరాల్లో పట్టణ ప్రకృతి సేద్యకారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.

Update: 2021-03-20 08:47 GMT

Terrace Garden: ఆర్గానిక్ మిద్దె తోటలు

Terrace Garden: రసాయనిక అవశేషాలు లేని ఆరోగ్యకరమైన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలన్న ఆలోచనతో నగరాల్లో పట్టణ ప్రకృతి సేద్యకారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇంటి బాల్కనీల్లో, మిద్దెల మీద ఇంటి అవసరాలకు సరిపడా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న మిద్దె సాగుదారులు ఎంతో మంది ఉన్నారు. ఈ కోవలోకే వస్తారు పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దంపతులు. నగరంలోని ప్రజలను మిద్దె సాగువైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నారు . అందుకోసం తమ అపార్ట్‌మెంట్‌లో ప్రయోగాత్మకంగా మిద్దె సాగు చేస్తున్నారు.

అక్కడ పూలు విరగబూస్తాయి. పండ్ల మొక్కలు ముచ్చటగొలుపుతాయి. రకరకాల కాయగూరలు, ఆకుకూరలు రోజూ కోతకు వస్తాయి. కానీ అవేవీ భారీ వ్యవసాయ క్షేత్రాలు కాదు వాటని పండించేది తలపండిన రైతులు కాదు శారీరక, మానసిక ఆనందాన్ని మిద్దెతోటల సాగు ద్వారా పొందుతున్నారు పిర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి దంపతులు. ప్రయోగాత్మకంగా అపార్ట్‌మెంట్‌లో మిద్దె సాగు చేస్తూ నగర ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆరోగ్యకరమైన, రసాయన అవశేషాలు లేని ఆహారాన్ని అందరూ పొందాలంటే అది మిద్దె తోటల ద్వారానే సాధ్యమవుతుందంటున్నారు. ఓ వైపు మేయర్ గా తన విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు మిద్దె సాగు పనుల్లో తన శ్రీమతికి చేదోడువాదోడుగా ఉంటూ పంటలు పండిస్తున్నారు.

ఓ వైపు నగర ప్రజల శ్రేయస్సు కోసం నగరాభివృద్ధికి పాటుపడుతూనే మరో వైపు కుటుంబసభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధను చూపిస్తున్నారు పిర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి. తన విధులకు ఏమాత్రం ఆటంకం రాకుండా ప్రయోగాత్మకంగా మిద్దె సేద్యం చేస్తూ నగర ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అపార్ట్‌మెంట్‌ కల్చర్ అధికంగా ఉండే నగరంలో పిర్జాదిగూడ ఒకట. డాబాల వీస్తీర్ణం కూడా ఎక్కువే. ఈ రూఫ్‌లన్నింటిపై మిద్దె సాగును ప్రోత్సహించాలన్నదే ఈ మేయర్ దంపతుల ప్రధాన లక్ష్యం. అందుకోసం వారు గత ఏడాది కరోనా సమయంలో మిద్దె సాగును ప్రారంభించారు.

నిజానికి మిద్దె సాగు గురించి ఈ మేయర్ దంపతులకు పెద్దగా అవగాహన లేదు. నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని ఇంటికి కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను పండించుకోవాలన్న ఆలోచనతో తమ అపార్ట్‌మెంట్‌లో మిద్దె తోటను ఏర్పాటు చేసుకున్నారు. మిద్దె సాగులో మొదట కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా నిరుత్సాహపడాల్సిన అవసరం లేందంటున్నారు మేయర్ వెంకట్‌రెడ్డి. అనుభవం పెరిగే కొద్ది అద్భుతమైన ఫలితాలను అందిపుచ్చుకోవచ్చంటున్నారు. మిద్దె సాగంటే చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. వాటన్నింటిని సులువైన మార్గంలో అధిగమించి పంటలను సాగు చేసుకోవచ్చంటున్నారు. చంటి పిల్లలను సాకినట్లు మొక్కలకు ప్రేమను పంచితే అవి తిరిగి మనకు ఆరోగ్యాన్ని అందిస్తాయంటున్నారు.

ఎటు చూసినా పచ్చదనం ఇండిన తోటను చూస్తూ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు మేయర్. ప్రతి రోజు ఒక గంట సమయాన్ని మిద్దె తోటలో గడిపితే కష్టాలన్నింటిని మరిచిపోతామంటున్నారు. ఇదే అనుభూతి నగర ప్రజలు పొందాలని భావిస్తున్నారు మేయర్. నగరంలోని ప్రతి మేడ మీద మిద్దె తోటలు నెలకొల్పాలని సంకల్పించుకున్నారు. తమ మిద్దె తోటను ఆదర్శంగా తీసుకుని ప్రజలు ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు.

మిద్దె తోటలను సాగు చేస్తే మేడ మీద బరువు పెరుగుతుందని, ఇళ్లు పాడవుతాయని చాలా మందిలో అపోహ ఉంటుంది. అలాంటి ఏ ఇబ్బందులు మిద్దె సాగు ద్వారా రావంటారు మేయర్ సతీమణి క్రాంతి. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే ప్రకృతి వనాలను మేడ మీద నెలకొల్పవచ్చంటున్నారు. రూఫ్ కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా ప్రత్యేక మడులను ఏర్పాటు చేసుకుని పంటలు పండించవచ్చంటున్నారు. ప్రధానంగా కరోనా వంటి విపత్కర సమయంలో ఇంటి పంటలు ఎంతో మేలు చేస్తాయంటున్నారు ఈమె. మిద్దె సాగు ప్రారంభంలో కాస్త ఇబ్బందులు ఎదురైనా రాను రాను అవి ఇచ్చే ఫలాలు అద్భుతంగా ఉంటాయంటున్నారు. మొక్కలను ప్రేమిస్తే అవి కూడా మనకు చాలా ఇస్తాయని మిద్దె తోటల ద్వారా తెలుసుకున్నామంటున్నారు.

రోజూ ఇంట్లో వినియోగించే కూరగాయలు, ఆకుకూరలతో పాటు ప్రయోగాత్మకంగా కొత్త కొత్త మొక్కలను చెట్లను పెంచుతున్నారు ఈ దంపతులు. ఒక్క డీ విటమిన్ తప్ప అన్ని రకాల విటమిన్లు గల మల్టీవిటమిన్ చెట్టు ఈ మిద్దె తోటలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అదే విధంగా సజ్జలను పండిస్తున్నారు. ఏడాదంతా దిగుబడిని ఇచ్చే సీడ్ లెస్ నిమ్మ, ఆర్నమెంటల్ అరటి, రనపాల, లెమెన్ గ్రాస్ ఇలా ఎన్నో రకాల మొక్కలు ఈ మిద్దె మీద కనువిందు చేస్తుంటాయి. ఇవే కాదు పసుపును సైతం మేడ మీద పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు.

ఈ రూఫ్ గార్డెన్ లో వివిధ రకాల పూలు ఆకర్షిస్తాయి. మందారాలు, బంతిపూలు, చామంతులు , పేపర్ పూలు ఇలా ఎన్నో రకాల పూలను సాగు చేస్తున్నారు. పరపరాగసంపర్కానికి ఈ పూల చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. పూలతో పాటే కొన్ని ఔషధ మొక్కలను పెంచుతున్నారు. ప్రస్తుతం వేసవి సీజన్ కావడతో మొక్కలను సంరక్షించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు క్రాంతి. కాంక్రిట్ జంగిల్ లో మిద్దె తోటలను సాగు చేస్తున్న ఈ మేయర్ దంపతులు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నగరవాసులు సైతం మిద్దె సాగుకు మొగ్గు చూపాలంటూ పిలుపునిస్తున్నారు. 

Full View


Tags:    

Similar News