జవానుగా 20 ఏళ్లు దేశ సేవ.. నేడు ప్రకృతి సేద్యంతో సమాజ సేవ..

Organic Farming: దేశ రక్షణలో 20 ఏళ్లు సేవలందించిన చేతులవి..నేడు మట్టి మనిషిగా మారి సమాజ సేవకు సంకల్పించాయి.

Update: 2023-01-03 14:00 GMT

జవానుగా 20 ఏళ్లు దేశ సేవ.. నేడు ప్రకృతి సేద్యంతో సమాజ సేవ..

Organic Farming: దేశ రక్షణలో 20 ఏళ్లు సేవలందించిన చేతులవి..నేడు మట్టి మనిషిగా మారి సమాజ సేవకు సంకల్పించాయి. రసాయనాలతో సారం కోల్పోయిన నేలలకు ప్రకృతి వనరుల సహకారంతో జీవాన్ని అందిస్తున్నాయి. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం రైతు బాధ్యత అని గుర్తు చేయడమే కాదు తానూ తూచా తప్పకుండా ఆ విధానాలను నూటికి నూరుశాతం పాటిస్తూ నేలతల్లి సేవలో సంతృప్తిని పొందుతున్నారు విజయనగరం జిల్లాకు చెందిన చంద్రశేఖర్ నాయుడు. దేశీయ సంపదైన వరి వంగడాలను సాగుకు ఎన్నుకుని రసాయన రహితంగా పండిస్తూ సత్ఫలితాలను సాధిస్తున్నారు. లాభాల సేద్యానికి బాటలు వేస్తున్నారు.

విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోపాడ గ్రామానికి చెందిన బంటుపల్లి చంద్రశేఖర్ నాయుడు ఆర్మీలో 22 సంవత్సరాలు జవానుగా విధులు నిర్వర్తించి 2013లో పదవీ విరమణ చేశారు. చిన్ననాటి నుంచి వ్యవసాయమంపై ఆసక్తి ఉండటంతో పంటలు పండించాలన్న సంకల్పంతో తనకున్న మూడేకరాల భూమిలో వ్యవసాయం మొదలుపెట్టారు చంద్రశేఖర్. అయితే పంటల సాగులో మితిమీరిన రసాయన ఎరువుల వాడకం ద్వారా ఎదురవుతున్న దుష్ప్రభావాలను గుర్తించి రసాయన రహితంగా సహజ పద్ధతులను అనుసరించి ఆరోగ్యకరమైన పంటలను పండించాలని నిర్ణయించుకున్నారు.

2014లో సేంద్రీయ వ్యవసాయానికి బాటలు వేశారు చంద్రశేఖర్‌. ప్రారంభంలో కొద్ది విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా ప్రకృతి సేద్యం చేశారు ఈ రైతు. ఆ అనుభవంతో సాగులో మెళకువలను నేర్చుకుని 2015 నుంచి తనకున్న మూడెకరాల పొలంలో ప్రకృతి విధానంలో వరి సాగు చేపట్టి సత్ఫలితాలను సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో అధిక మొత్తంలో సాగులో ఉన్న పంట వరి. ఈ వరి పంటనే ఎన్నుకుని రైతుల సాగుతీరులో మార్పులు తీసుకురావాలనుకున్నారు చంద్రశేఖర్‌. అయితే తోటి రైతుల్లా హైబ్రిడ్ రకాలను పండించాలనుకోలేదు అంతరించిపోయే దశకు చేరిన ఆరోగ్య విలువలు కలిగిన దేశీయ వరి వంగడాలను పండిస్తున్నారు. మొదట్లో ఒక్క వరి రకంతో ప్రయోగాత్మక సాగును ప్రారంభించిన చంద్రశేఖర్ నేడు నవారా, సన్నాలు, సిద్ద సన్నాలు, రత్నచోడి, నల్ల వరి వంగడాలను పండిస్తున్నారు. వర్మీకంపోస్ట్, ఘన, ద్రజీవామృతాలు, పంచగవ్య, గోమూత్రాన్నే సాగులో వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకు పంటకు ఎలాంటి చీడపీడలు ఆశించలేని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆశించినా వాటి నివారణకు సహజ ఎరువులనే వినియోగిస్తామన్నారు.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందరికీ అందించాలన్నదే ఈ సాగుదారు ప్రధాన లక్ష్యం. అందుకే పోషకాలు పుష్కలంగా ఉండే దేశీయ వంగడాలను సాగు చేస్తున్నారు. ప్రకృతి విధానాల వల్ల ఎకరానికి 15 బస్తాల దిగుబడిని వస్తోందని పొలం వద్దకే వచ్చి కొనుగోలుదారులు పంటను కొంటున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు చంద్రశేఖర్. ఎకరాకు 20 వేల వరకు ఖర్చవుతోంది. పెట్టుబడి పోను 55 వేల రూపాయల వరకు ఆదాయం వస్తోందని తెలిపారు.

ప్రకృతి ఎరువులను స్వయంగా తయారు చేసుకుటున్నారు ఈ సాగుదారు. అందుకోసం 15 దేశీ ఆవులను పొలంలోనే పెంచుతున్నారు. ప్రత్యేకంగా వర్మీ కంపోస్ట్ యూనిట్‌ను నెలకొల్పారు. తాను తయారు చేసిన వర్మికంపోస్టును తన అవసరాలకు వినయోగించగా మిగిలిన ఎరువును తనవలే ప్రకృతి సేద్యం చేసే రైతులకు అందిస్తూ అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు చంద్రశేఖర్‌.

Full View


Tags:    

Similar News