Farmers Face Problems : దళారుల ధనదాహానికి బలవుతున్న అన్నదాతలు

Update: 2020-07-20 08:30 GMT

Farmers Face Problems : నకిలీ భూతం రైతులను ఏళ్ల తరబడి వెంటాడుతుంది. ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా నకిలీ దందా అన్నదాతలపై పంజా విసురుతూనే ఉంది. చేసిన శ్రమ పెట్టిన పెట్టుబడిని నిర్వీర్యం చేస్తోంది. రైతుల ఆశలను ఆవిరి చేసి కన్నీరు పెట్టిస్తోంది. చిన్న చినుకు పడగానే రైతులు ఎంతో ఆశతో మిర్చి విత్తనాలు కొనుగోలు చేసి ఉత్సాహంతో సాగు పనులు మొదలుపెట్టారు. కానీ నకిలీమాయజాలానికి అవి మొలకెత్తడం లేదు. వాటిని చూసిన రైతులు ఇంకెన్నీసార్లు మోసపోవాలి దేవుడా అంటూ విలపిస్తున్నారు. ఖమ్మం జిల్లా మిర్చి రైతుల ఆవేదనపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 60 వేల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తున్నారు. తేజ రకం మిర్చి పంటకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో ఈ పంట సాగుకు రైతులు మొగ్గు చూపారు. కానీ దళారుల ధనదాహం రైతులను నిండా ముంచింది. నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టి జేబులు నింపుకున్నారు. గంపెడు ఆశతో సాగు పనులు మొదలుపెడితే మొక్క పెరగదు. ఒకవేళ పెరిగినా పూత ఉండదు. పూత వచ్చినా కాత ఉండదు. ఇలా రైతులు ప్రతీ ఏటా తీవ్రంగా నష్టపోతున్నారు.

నకిలీ దందాను రూపుమాపేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నా దందా మాత్రం ఆగడం లేదు. వివిధ కంపెనీలకు చెందిన బాధ్యులు, జిల్లాలోని పలు కంపెనీల డిస్ట్రిబ్యూటర్లు, వ్యాపారులపై అధికారులు కేసులు నమోదు చేసి జైళ్లకు పంపించారు. ఆయా దుకాణాల లైసెన్సులు కూడా రద్దు చేశారు. కానీ గ్రామాల్లోని చోటా నాయకులే విత్తన వ్యాపారులుగా అవతారమెత్తి రైతుల పొట్టకొడుతున్నారు.

ఇక రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ విక్రయించిన వరి విత్తనాల్లో సరైన మొలక శాతం లేకపోవడంతో రైతులు లబోదిబోమన్నారు. పరిహారంపై కొందరు రైతులు కోర్టును కూడా ఆశ్రయించారు.ఈ ఖరీఫ్‌లో విత్తనాల కొరత లేకుండా చూస్తామని వ్యవసాయాధికారులు ప్రకటించారు. కానీ మండల పాయింట్లలోకి ఇండెంట్‌లో సగమే వచ్చాయి. కొన్నిచోట్ల ఇంకా వస్తున్నాయి. దీంతో రైతులకు ప్రైవేట్ కంపెనీల విత్తనాలు దిక్కయ్యాయి. ఇదే అదనుగా భావించిన దళారులు నకిలీ విత్తనాలను మార్కెట్లోకి దింపేశారు.

నెలరోజుల క్రితం వైరా, మధిర, తిరుమలాయ పాలెం మండలాల్లో వేసిన మిర్చి నారు ఇప్పటి వరకు మొలక రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఈ విషయంపై దృష్టిసారించి నకిలీ విత్తనాలు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Full View


Tags:    

Similar News