పుట్టగొడుగుల పెంపకంలో రాణిస్తున్న యువరైతు

Mushroom Farming: చదువుకుంది బి.ఎస్సీ ఎలక్ట్రానిక్స్.

Update: 2022-03-31 13:10 GMT

పుట్టగొడుగుల పెంపకంలో రాణిస్తున్న యువరైతు

Mushroom Farming: చదువుకుంది బి.ఎస్సీ ఎలక్ట్రానిక్స్. ఉద్యోగ ప్రయత్నాలు చేసి విసిగి వేసారి స్వయం ఉపాధి పొందాలన్న కృతనిశ్చయంతో వ్యవసాయ అనుబంధ రంగాల వైపు మక్కువ చూపాడు. ఉన్నత చదువులు చదివి సాగు వైపు ఎందుకు అని తల్లిదండ్రులు వారించినా వినలేదు. తనతెలివితేటలకు కాస్త శ్రమను జోడించి పట్టుదలతో పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించాడు శ్రీకాకుళం జిల్లాలోని వాకలవలస గ్రామానికి చెందిన యువరైతు గౌతమ్. మొదట అవగాహన లేమితో తడబడ్డాడు. సమస్యకు కారణమేంటో తెలుసుకున్నాడు.ఎలాగైనా పడిన చోటే లేచి నిలబడాలన్న నిర్ణయానికి వచ్చాడు. తానేంటో నిరూపించాలనుకున్నాడు. ఆ పట్టుదలే గౌతమ్‌ను నేడు యువతరానికి ఆదర్శంగా నిలిచేలా చేసింది.

రెండున్నర లక్షల రూపాయల పెట్టుబడితో పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించాడు గౌతమ్. సీజన్‌ వారీగా వచ్చే వాతావరణ మార్పులను అనుసరించి రెండు రకాల పుట్టగొడుగులను పెంచుతున్నాడు. 6 నెలలు ముత్యపు చిప్ప పుటట్టగొడుగులో మరో ఆరు నెలలు మిల్కీ మష్‌రూమ్స్‌ పెంపకం చేస్తున్నాడు. చిన్నపాటి గదిని నిర్మించుకుని అందులో కృత్రిమ వాతావరణాన్ని కల్పిస్తూ సేంద్రియ పద్ధతుల్లో పుట్టగొడుగుల పెంచుతున్నాడు. ప్రారంభంలో కెమికల్ తో వీటిని పెంచడం వల్ల చాలా సమస్యలు ఎదురయ్యాయని ప్రస్తుతం స్టీమింగ్ పద్ధతిలో పుట్టగొడుగుల పెంపకం ద్వారా నాణ్యమైన పుట్టగొడుగులు అందడంతో పాటు దిగుబడి అధికంగా ఉంటుందటున్నాడు ఈ సాగుదారు. నెలకు ఎంతలేదన్నా 60 వేల వరకు ఆదాయాన్ని పొందవచ్చని తెలిపాడు.

పెంపకం పూర్తైన తర్వాత రైతుముందు ఉన్న ప్రధానమైన ఛాలెంజ్ మార్కెటింగ్. మార్కెటింగ్‌లో మెళకువలు తెలియకే చాలా మంది ఈ రంగంవైపు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. కానీ గౌతమ్ ఆ ఛాలెంజ్‌ను పట్టుదలతో స్వీకరించాడు. మార్కెటింగ్ లో తాను మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డానని ఈ యువరైతు తెలిపాడు. స్థానికంగా పుట్టగొడుగులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలియజేశాడు, రైతు బజార్లకు వెళ్లి అక్కడ ప్రచారం చేశాడు. అలా ప్రతి రోజు రైతు బజార్ వెళ్లేవాడు, పుట్టగొడుగులను ఎవరూ కొనుగోలు చేయకపోయినా ఓపికతో తన ప్రయత్నాలు తాను చేస్తూ వచ్చాడు. అందుకే పెపకంలో మెళకువలతో పాటు మార్కెటింగ్ లో ఓపిక చాలా అవసరం అంటున్నాడు గౌతమ్.

పుట్టగొడుగుల పెంపకంలో విత్తనం సమస్య అధికంగా ఉందంటున్నాడు ఈ యువరైతు. స్థానికంగా విత్తనం అందుబాటులో లేదని బెంగళూరు, ఒరిస్సా ప్రాంతాల నుంచి విత్తనాన్ని సేకరించడం వల్ల విత్తనం నా‌ణ్యతపైన ప్రభావం చూపుతోందని గౌతమ్ తెలిపాడు. వారానికి ఒకసారి విత్తనాన్ని సుదూరం నుంచి తెప్పిస్తానని విత్తనం ఖర్చుతో పాటు రవాణా ఖర్చు అధికమవుతోందని , స్థానికంగా విత్తనం లభిస్తే రైతుకు మేలు జరుగుతుందని తెలిపాడు. కొత్తవారూ, పుట్టగొడుగుల పెంపకానికి ముందుకు వస్తారన్నాడు.

పెంపకం ప్రారంభించిన 6 నెలల వరకు లాభాలను అంచనా వేయవద్దని రైతు సూచిస్తున్నాడు. చాలా వరకు సందర్భాల్లో నష్టాలు ఎదురవుతాయన్నాడు. కొత్తగా వచ్చేవారు తక్కువ పెట్టుబడితో పెంపకం మొదలుపెట్టాలన్నారు. ప్రారంభంలో నష్టాలు ఎదురైనా ఏమాత్రం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని రైతు తన అనుభవపూర్వకంగా తెలిపాడు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పుట్టగొడుగుల పెంపకం ద్వారానే లభిస్తుందన్నాడు. తన కుటుంబ సభ్యుల సహకారంతోనే మష్‌రూమ్స్ పెంపకంలో రాణిస్తున్నానని తెలిపాడు.

పుట్టగొడుగుల పెంపకంతో స్వయం ఉపాధి పొందుతానన్న గౌతమ్ ఆలోచనను మొదట్లో గౌతమ్ తల్లిదండ్రులు తిరస్కరించారు. చదువుకుతగ్గ ఉద్యోగం చూసుకోమన్నారు. కానీ గౌతమ్ పట్టుదలతో పెంపకం మొదలు పెట్టి నికర ఆదాయాన్ని సంపాదించాడు. గౌతమ్ పట్టుదలను చూసి మొదట వద్దన్న తల్లిదండ్రులే ఇప్పుడు పెంపకంలో సహకారం అందిస్తున్నారు. తోటి యువతకు తన కొడుకు ఆదర్శంగా నిలుస్తుండటం చూసి ఎంతో ఆనందపడుతున్నారు.

Full View


Tags:    

Similar News