Green Field Highway Troubles Farmers: తెలంగాణాలో రైతులకు గ్రీన్ ఫీల్డ్ హైవే టెన్షన్!

Update: 2020-07-06 05:38 GMT

Greenfield highway troubles farmers in Telangana : అన్నం పెట్టె రైతన్నకు కష్టం వచ్చింది. నేలను నమ్ముకుని వ్యవసాయమే ప్రపంచం గా జీవించే అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. ఖమ్మం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం చేపడుతున్న భూసేకరణపై రైతన్నల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అభవృద్ధి పేరుతో పచ్చని పొలాలను సేకరించొద్దంటూ వేడుకుంటున్నారు అన్నదాతలు.

ఖమ్మం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం భూసేకరణ జరుగుతోంది. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నూతనంగా నిర్మించనున్న నేషనల్ హైవే కోసం అధికారులు భూసేకరణ చేపడుతున్నారు. కల్లూరు మండలంలోని ఓబులరావు బంజర్, ముచ్చావరం గ్రామాల్లో పోలీస్ బందోబస్తు మధ్య భూసేకరణ జరిగింది. అయితే భూ సేకరణపై రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

నేషనల్ హైవే కోసం తమ ప్రాంతంలో భూసేకరణ చేపట్టొద్దని అనేక సార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోకుండా సర్వేలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. సంవత్సరానికి రెండు పంటలు పండే వ్యవసాయ భూములను సేకరించి హైవేలు నిర్మించడం కరెక్ట్ కాదంటున్నారు అన్నదాతలు.

గ్రీన్ ఫీల్డ్ హైవే పై రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా అధికారులు మాత్రం భూ సేకరణ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు కల్లూరు, తల్లాడ మండలాల్లో 120 ఎకరాల్లో సర్వే పూర్తి చేసినట్లు ఆర్డివో సూర్యనారాయణ తెలిపారు. ఈ నెల 10వ తేదీ నాటికీ కల్లూరు రెవెన్యూ డివిజన్ లో భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు.

మొత్తంగా గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం చేస్తున్న భూసేకరణ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని అయితే హైవే కోసం వ్యవసాయ భూములను సేకరించొద్దని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి భూ సేకరణ ప్రక్రియ నిలిపేయాలని రైతులు కోరుతున్నారు.

Full View


Tags:    

Similar News