Grass Cultivation: పశు గ్రాసాల సాగులో రాణిస్తున్న జోగులాంబ గద్వాల జిల్లా రైతు

Grass Cultivation: ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు కేవలం ధాన్యపు పంటలపైనే ఆధారపడకుండా ఉద్యాన తోటలతో పాటు పాడి పశువులు, జీవాల పెంపకంపైన శ్రద్ధ చూపుతున్నారు.

Update: 2021-09-01 15:07 GMT

Grass Cultivation: పశు గ్రాసాల సాగులో రాణిస్తున్న జోగులాంబ గద్వాల జిల్లా రైతు 

Grass Cultivation: ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు కేవలం ధాన్యపు పంటలపైనే ఆధారపడకుండా ఉద్యాన తోటలతో పాటు పాడి పశువులు, జీవాల పెంపకంపైన శ్రద్ధ చూపుతున్నారు. ఈ క్రమంలో పోషక విలువలతో కూడిన పచ్చిగ్రాసాలకు ప్రాముఖ్యత ఏర్పడింది. అయితే పశువులను పెంచుతున్న రైతులు గ్రాసాలను సాగు చేసుకుంటున్నప్పటికీ కల్తీలేని, మేలైన, నాణ్యమైన విత్తనాలు అంతటా అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన జోగులాంబ గద్వాల జిల్లా కుర్తిరావల చెరువు గ్రామానికి చెందిన గణపతి రెడ్డి తనకున్న రెండున్నర ఎకరాల పొలంలో ఎకరం విస్తీర్ణంలో మేలైన పశుగ్రాసాలను విత్తనోత్పత్తి కోసం పెంచుతున్నారు. మొదట గ్రాసాల సాగంటే హేళన చేసిన వారే నేడు రైతు ఆర్ధికాభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారు. తక్కువ పెట్టుబడితో పెద్దగా శ్రమలేకుండా గ్రాసాలను సాగు చేసుకోవచ్చని మిగతా పంటలతో పోల్చితే గ్రాసాల సాగు ద్వారా మంచి ఆదాయం పొందవచ్చంటున్నారు గణపతి రెడ్డి.

గ్రాసాల్లోనూ అధిక పోషకవిలువలు కలిగి దిగుబడులు ఎక్కువగా అందించే రకాలను పండిస్తున్నారు. హీరామణి, జింజువా, పారాగడ్డి, దశరథ, సూపర్ నేపియర్ వంటి రకాల గ్రాసాల విత్తనోత్పత్తి చేస్తున్నారు. ఇందులో జింజువా గ్రాసం ఒకసారి నాటితే 30 ఏళ్ల వరకు దిగుబడి అందిస్తుందని రైతు చెబుతున్నారు. 50 రోజులకు మొదటి కోత మొదలై ప్రతి నెల గ్రాసం అందుతుందని అంటున్నారు. ఈ గ్రాసం తియ్యగా ఉండటం వల్ల ఆవులు ఇష్టంగా తింటాయంటున్నారు. ఇక హీరామణి గ్రాసం కడా నాటిన 30 ఏళ్ల వరకు దిగుబడి అందిస్తుంది. ఈ గ్రాసం పది ఫీట్ ల ఎత్తు వరకు పెరుగుతుందని ఈ గ్రాసాన్ని పశువులకు పౌష్టికరమైన దాణాగా వాడవచ్చంటున్నారు. సేంద్రియ విధానాలను అనుసరిస్తూ ప్రతి రైతు గ్రాసాలను సాగు చేసుకుంటే పశువుల పెంపకం ఖర్చు తగ్గించుకోవడంతో పాటు పాల ఉత్పత్తి పెరుగుతుంది అంటున్నారు.

ఎకరం విస్తీర్ణంలో గ్రాసాల సాగు ద్వారా ఏడాదికి లక్ష వరకు ఆదాయం సమకూరిందని రైతు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి ఆర్డర్ వస్తున్నాయని, గ్రాసం విత్తనాలను కొరియర్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన ప్రతి పంట కావడంతో నాణ్యత బాగుందని ముఖ్యంగా నాటు రకాల గ్రాసాల విత్తనాలను తీసుకునేందుకు పశుపోషకులు ఆసక్తి చూపుతున్నారంటున్నారు.

గ్రాసాలతో పాటే ఎకరం విస్తీర్ణంలో వరి, పావు ఎకరంలో కూరగాయలు, పండ్లు పెంచుతున్నారు ఈ రైతు వరిలో దేశవాళీ రకాలైన నవారా, కులకర్ణి, కాలీజీరా రక్తశాలి రకాలతో పాటు తెలంగాణ సోనా వంటి వంగడాలు పెంచుతున్నారు. ప్రస్తుతం ఇవి నారు దశలో ఉన్నాయి ఇక చీడల నుంచి పంటను కాపాడుకునేందకు ఎరపంటగా ఆముదం పండిస్తున్నారు. వీటిని పూర్తి సేంద్రియ విధానంలోనే పండిస్తున్నారు. భవిష్యత్తులో సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచుతామని రైతు చెబుతున్నారు.

గ్రాసాలు, కూరగాయలు, వరి సాగు కోసం అవసరమైన ఎరువులను స్వయంగా తయారు చేసుకునేందకు దేశవాళీ గిర్ జాతి ఆవులను పొలంలోనే పెంచుతున్నారు ఈ రైతు. వీటిని నల్గొండ నుంచి తెప్పించారు. గిర్ జాతి ఆవులు మేలైనవని వీటి పాలల్లో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయంటున్నారు. అయితే ఆవులు వట్టిపోయాయని వాటిని అమ్మకుండా వాటి నుంచి వచ్చే పేడతో ఎన్నో ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు ఈ రైతు. అంతే కాదు పంటకు పోషకాలు అందించే ఎరువులను తయారు చేసుకోవచ్చని తద్వారా నేలకు సారం అందించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను అందించ్చినట్లవుతుందటున్నారు.

ప్రకృతిలో ఉండే ప్రతి పక్షి రైతుకు మంచి నేస్తాలంటున్నారు ఈ సాగుదారు. పంటల సాగులో రైతును ఇబ్బంది పెట్టే పురుగు సమస్యను పక్షలు నివారిస్తాయని తెలిపారు. పక్షులను రక్షిస్తే..అవి ప్రకృతిని రక్షిస్తాయని చెబుతున్న గణపతి రెడ్డి...వాటికి తన పొలంలో ఆవాసం ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా పక్షల కిలకిలరావాలను, పలకరింపులను నేర్చుకున్నారు. ఇటు పక్షులు, గోవులతో పాటు నేలతల్లిని సంరక్షిస్తూ గ్రాసాల సాగు ద్వారా ఆర్ధికాభివృద్ధిని సాధిస్తున్న గణపతి రెడ్డి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.  

Full View


Tags:    

Similar News