Ginger Cultivation: ఈ పద్దతులు పాటిస్తే.. అల్లం సాగులో మీరే రారాజు

Ginger Cultivation: మార్కెట్‌లో సీజన్‌తో సంబంధం లేకుండా అన్నివేళలలా గిరాకీ ఉండే పంట అల్లం.

Update: 2021-10-25 11:21 GMT

Ginger Cultivation: ఈ పద్దతులు పాటిస్తే.. అల్లం సాగులో మీరే రారాజు

Ginger Cultivation: మార్కెట్‌లో సీజన్‌తో సంబంధం లేకుండా అన్నివేళలలా గిరాకీ ఉండే పంట అల్లం. ప్రతి ఇంట్లో ఉండాల్సిన, ప్రతి వంటలో వాడాల్సిన సుగంద ద్రవ్యం ఇది. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్‌పెట్టే , రోగ నిరోధకశక్తిని బలోపేతం చేసే దివ్యౌషధం. అందుకే ప్రతీ ఒక్కరికీ నిత్యావసరమైన అల్లం సాగుతో లాభదాయకమైన ఆధాయాన్ని ఆర్జిస్తున్నారు సంగారెడ్డి జిల్లాకు రైతు మోహన్. అందులోనూ అంతర పంటలను పండిస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.

ఆధునిక సాగు విధానాలు సాగుదారులకు ఆసరాగా నిలుస్తున్నాయి. విపత్కర పరిస్థితులను సైతం రైతు తట్టుకుని నిలబడగలిగే శక్తిని అందిస్తున్నాయి. ఒకప్పుడు ఏ పంట వేయాలన్నా రైతులు మూసదోరణులనే అవలంభించేవారు. పక్క రైతు పాటించన పద్ధతులనే పాటిస్తూ వచ్చేవారు. ఈ విధానం సరైనది కాదని ప్రతి రైతు తన పొలాన్ని ప్రయోగశాలగా మార్చి అందరికంటే భిన్నంగా సేద్యం చేసినప్పుడే ఆర్ధికపరిపుష్టిని సాధించగలడని నిరూపిస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం రంజోల్ గ్రామానికి చెందిన రైతు మొహన్. ఎర్ర నేలల్లో పండించే అల్లాన్ని నల్లరేగడి నేలల్లో వినూత్నంగా పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆధునిక సేద్యపు పద్ధతులను పాటిస్తూ చక్కటి దిగుబడిని అందిపుచ్చుకుంటున్నారు.

ఏ పంటలో అయినా విత్తనం ఎంపిక అనేది ముఖ్యమైన ప్రక్రియ అని అంటున్నారు ఈ సాగుదారు. ఎంత మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకుంటే , అంత మంచి దిగుబడి లభిస్తుందని తెలిపారు. పీచుపదార్ధం అధికంగా ఉండి తెగుళ్లు వచ్చే అవకాశం తక్కువగా ఉండే కేరళకు చెందిన మారన్‌ అల్లం రకాన్ని సాగుకు ఎన్నుకున్నారు మోహన్. ప్రతి ఏటా 4 నుంచి 5 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.

గత 15 సంవత్సరాలుగా అల్లం సాగు చేస్తున్న మోహన్ ఎత్తుమడుల విధానాన్ని అవలంభిస్తున్నారు. ఈ విధానం రైతుకు ఎంతో ఉపకరిస్తుందంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు చుట్టుపక్కన పొలాలు నీట మునిగి తెగుళ్ల బారిన పడినా ఎత్తుమడుల విధానం వల్ల అల్లం పంటకు ఎలాంటి సమస్య ఏర్పడలేదని ఎంతో గర్వంగా చెబుతున్నారు మోహన్‌.

ఏ పంటలో అయినా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని సాధించినప్పుడే రైతు సాగులో నిలదొక్కుకోగలడని మోహన్ చెబుతున్నారు. అధిక దిగుబడుల కోసం ఇష్టారీతిన రసాయనాలు వాడకుండా ముందుగా నేలలోని సూక్ష్మపోషకాల స్ధాయిలను తెలుసుకుని పంటలు సాగు చేయాలంటున్నారు. అందుకోసమే అల్లం సాగు చేసే ప్రతిసారి మట్టి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకుంటున్నానని మోహన్ తెలిపారు.

ఒకప్పుడు అల్లం పండిస్తే లక్షల ఆదాయం వచ్చేదని కానీ మార్కెట్‌లో ధరల వ్యత్యాసం కారణంగా ఆ పరిస్థితి ఇప్పుడు లేదంటున్నారు మోహన్. అందుకే ఒకే పంట మీద ఆధారపడకుండా అంతర పంటలు సాగు చేస్తున్నానని రైతు చెబుతున్నారు. మార్కెట్‌లో ధర ఉన్నా లేకున్నా రైతు నష్టపోకుండా ఉండేందుకు అంతర పంటలను వేసుకోవాలని సూచిస్తున్నాడు. అల్లంలో అరటిని అంతర పంటగా వేసుకోవడం వల్ల రైతు ఆర్ధికాభివృద్ధి సాధించగలరని రైతు చెబుతున్నారు. టిష్యూ కల్చర్‌కు చెందిన జీ9 అరటి రకాన్ని హైడెన్సిటీ విధానంలో అంతర పంటలుగా సాగు చేస్తున్నారు ఈ సాగుదారు. ఒక్కో మొక్కను 15 రూపాయలకు కొనుగోలు చేసి ఎకరాకు సుమారు 1700 మొక్కలను నాటుకున్నారు. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చింది. ఎంత లేదన్నా ఎకరాకు 40 నుంచి 50 టన్నల వరకు దిగుబడి వస్తుందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రణాళికా ప్రకారంగా పంటలను పండిస్తూ కొద్ది పాటి మెళకువలను పాటిస్తూ అల్లం సాగుతో ఆర్ధికాభివృద్ధిని సాధిస్తున్నారు ఈ సాగుదారు. మిగతా రైతులు మూసధోరణులను పక్కన పెట్టి ఆధునిక విధానాలను అందిపుచ్చుకుంటే సాగులో లాభాలు సాధించడం పెద్ద విషయమేమి కాదంటున్నారు మోహన్. ఆ దిశగా రైతులు ఆలోచన చేస్తారని మనమూ ఆశిద్దాం. 

Full View


Tags:    

Similar News