Natural Farming: ప్రకృతి వ్యవసాయం వైపు యువతరం పయనం

Natural Farming: వయస్సు రెండు పదులే అయినా ఆ యువకుడి సంకల్పం గొప్పది.

Update: 2021-12-10 05:10 GMT

Natural Farming: ప్రకృతి వ్యవసాయం వైపు యువతరం పయనం

Natural Farming: వయస్సు రెండు పదులే అయినా ఆ యువకుడి సంకల్పం గొప్పది. దేశీయ గోవుపై మమకారం, ప్రకృతి మీద ప్రేమతో ఓ వైపు డిగ్రీ చదువుకుంటూనే మరోవైపు గోఆధారిత విధానంలో దేశీయ వరి వంగడాల సాగుకు నడుంబిగించాడు. తోటి యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన పాకాల శ్రీధర్.

శ్రీధర్ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. రసాయనాల వినియోగంతో సాగులో తన తండ్రి ఎదుర్కొంటున్న కష్టాలను చూడటంతో పాటు ఆ విషరసాయనాల వల్ల నేల, నీరు, గాలి వంటి ప్రకృతి వనరులు కలుషితమవుతుండటం ఈ యువకుడిని ఆలోచింపచేసింది. ఓ వైపు పర్యావరణాన్ని రక్షించడంతో పాటు మరో వైపు అంతరించిపోయే దశకు చేరిన దేశీయ సిరులను తోటి రైతులకు అందించాలన్న ధృడ సంకల్పంతో ముందుకు సాగుదున్నాడు శ్రీధర్. 10 గుంటల భూమిని కౌలుకు తీసుకుని అందులో 16 రకాల దేశీయ వరి వంగడాలను పండిస్తూ నాణ్యమైన దిగుబడులను సాధిస్తున్నాడు.

దేశీయ వరి వంగడాల సాగుకు పెద్దగా ఖర్చేమి లేదని అన్ని పనులు తానే చేసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు ఈ యువరైతు. పంటకు కావాల్సిన పోషకాలను గో వ్యర్ధాల నుంచే తయారు చేసి అందిస్తున్నాడు. జీవామృతం, ఘనజీవామృతం, బియ్యంనీరు, నీమాస్త్రాలను వివిధ దశల్లో అందియడం వల్ల ధాన్యం దిగుబడి ఆశాజనకంగా ఉదంటున్నాడు శ్రీధర్. రసాయన రహితంగా ప్రకృతి సిద్ధంగా పంటలు సాగు చేస్తుండటం వల్ల తనకు ఎంతో సంతృప్తి లభిస్తోందంటున్నాడు. అదే విధంగా ఈ దేశీయ వరి వంగడాలను గ్రామంలోని తోటి రైతులకు ఉచితంగా అందిస్తానంటున్నాడు ఈ యువరైతు.

ప్రకృతి విధానంలో పండిన బియ్యానికి మార్కెట్‌లో మంచి గిరాకీనే ఉంది కానీ పట్టణాల్లో నివసించే వారు ఆర్గానికి ఆహారం కోసం ఆర్గానిక్ స్టోర్లను ఆశ్రయిస్తున్నారే కానీ రైతుల వద్ద నేరుగా కొనుగోలు చేయడం లేదు తద్వారా రైతుకు ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదంటున్నాడు ఈ యువరైతు. ప్రతి కుటుంబానికి ఏ విధంగా ఫ్యామిలీ డాక్టర్, లాయర్ అంటూ ఎలా ఉంటారో అదే విధంగా గోఆధారిత వ్యవసాయం చేసే రైతులను ఫ్యామిలీ ఫార్మర్‌గా ఎంచుకోవాలంటున్నాడు శ్రీధర్. ఆహార ఉత్పత్తులను నేరుగా రైతుల నుంచి సేకరించడం వల్ల రైతులు ఆర్ధికంగా నిలదొక్కుకోవడంతో పాటు వినియోగదారులకు ఆరోగ్యకరమైన, నమ్మకమైన ఆహారాం లభిస్తుందంటున్నాడు. 

Full View


Tags:    

Similar News