Dragon Fruit Cultivation: డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న యువరైతు రమేష్ బాబు

Dragon Fruit Cultivation: సాగులో రైతులు ఎదుర్కొనే కష్టనష్టాలకు పరిష్కారం చూపాలనే సదుద్దేశంతో ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు సాగు బాట పట్టాడు.

Update: 2021-06-18 05:01 GMT

Dragon Fruit Cultivation: డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న యువరైతు రమేష్ బాబు

Dragon Fruit Cultivation: సాగులో రైతులు ఎదుర్కొనే కష్టనష్టాలకు పరిష్కారం చూపాలనే సదుద్దేశంతో ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు సాగు బాట పట్టాడు. వ్యవసాయం మీద ఉన్న మక్కువతో స్వగ్రామంలో ఇదివరకు ఏ రైతు సాగు చేయని పంటను పండిస్తున్నాడు. అమెరికా , చైనా వంటి దేశాల్లో అధిక మొత్తంలో సాగయ్యే డ్రాగన్ పండ్లును శ్రీకాకుళం జిల్లాకు కొత్తగా పరిచయం చేస్తున్నాడు రమేష్ బాబు. తనకున్న మూడు ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ ను పూర్తి సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నాడు. డిమాండ్ ఉన్న పండ్లను ఎంచుకుని సాగు చేస్తే మంచి ఆదాయం వస్తుందంటున్నాడు.

శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం నుండి 35 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం పేరు కాగితాపల్లి గ్రామం. ఈ యువరైతు పేరు రమేష్ బాబు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన రమేష్ బాబు తన ఉద్యోగాన్ని సైతం వీడి స్వగ్రామంలో సేద్యం చేయాలనుకున్నాడు. అందరిలా వరి, ఇతర సంప్రదాయ పంటల సాగుకు ఆసక్తి చూపలేదు ఈ రైతు. ఇదివరకు ఎన్నడూ జిల్లాలో ఏ రైతు సాగు చేయనటువంటి పంట వేయాలనుకున్నాడు. తక్కువ శ్రమతో నష్టం లేని పంట ఏదైనా ఉందా అంటూ వెతుకులాట మొదలుపెట్టాడు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న డ్రాగన్ పండ్ల సాగు గురించి తెలుసుకున్నాడు. వివిధ రాష్ట్రాలు తిరిగి పంట సాగు పై అవగాహన పెంచుకున్నాడు. హైదరాబాద్ నుంచి మొక్కలను తెప్పించుకుని తనకున్న మూడు ఎకరాల్లో 4 వేల మొక్కలను నాటి ప్రయోగాత్మకంగా డ్రాగన్ పండ్లను సాగు చేస్తున్నాడు.

ముఖ్యంగా మొక్క ఎదుగుదలకు తోడ్పడే ప్రత్యేకమైన సిమెంట్ పోల్స్ ను గుజరాత్ నుంచి తెప్పించాడు రమేష్ బాబు. డ్రిప్ విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సీ విటమిన్ అధికంగా ఉండే రెడ్ పల్ప్ రకాన్ని ప్రస్తుతం సాగు చేస్తున్నాడు. డ్రాగన్ ఫ్రూట్ మొగ్గ దశ నుంచి పండుగా మారాలంటే సుమారు 45 రోజుల సమయం పడుతుందంటున్నారు. వేసవిలో 40 నుంచి 45 డిగ్రీల వేడిని ఈ మొక్క తట్టుకుంటుందంటున్నారు. అందుకే ఈ ప్రాంతంలో వినూత్నంగా డ్రాగన్ సాగుచేస్తున్నానని రైతు తెలిపాడు.

జిల్లా ఉద్యానాధికారులు తనకు ఎంతో సహాయాన్ని అందిస్తున్నారంటున్నాడు ఈ రైతు. ప్రభుత్వ సబ్సడీ రెండున్నర ఎకరాలకు 8 లక్షల వరకూ వస్తుందని చెబుతున్నాడు. వరి, ఇతర సంప్రదాయ పంటల వల్ల నష్టమే తప్ప లాభాలు లేకుండా పోయాయని నష్టం లేకుండా కొన్ని సంవత్సరాల వరకూ ఫలసాయంతో పాటు అధికదిగుబడి, ఆదాయం వచ్చే పంటగా ఈ డ్రాగన్ ఫ్రూట్ కనపడిందంటున్నాడు.

మొదటి సంవత్సరం ఎకరాకు ఒక టన్ను దిగుబడి వస్తే రెండవ సంవత్సరం 4 టన్నుల వరకూ వస్తుంది. ఒక్కొక్క పండు 300 నుండి 400 గ్రాముల బరువు ఉంటుంది. ఎకరా పంట సాగుకు సుమారు 4నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. తక్కువ నీటి యాజమాన్యంతో సేంద్రియ ఎరువులనే వాడుతూ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసుకోవచ్చంటున్నాడు రమేష్ బాబు. చీడపీడల సమస్యపెద్దగా ఉండదంటున్నాడు. డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఆసక్తి చూపే రైతులకు అవగాహన కల్పిస్తామంటున్నాడు ఈ రైతు. డ్రాగన్ పండ్ల సాగు విధానంపై అవగాహన కల్పించి ఉద్యానాధికారులు రుణాలు అందిస్తే సిక్కొలు జిల్లా రైతులు వలసకూలీగా మారే అవకాశం తక్కువగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Full View
Tags:    

Similar News