Solar Insect Trap: కీటకాల నిర్మూలనకు నూతన టెక్నాలజీ

Solar Insect Trap: పంట పొలాల్లో కీటకాలను నిర్మూలించేందుకు డెల్టా థింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ కంపెనీ నూతన టెక్నాలజీని వినియోగంలోకి తీసుకువచ్చింది.

Update: 2021-12-28 12:03 GMT

Solar Insect Trap: పంట పొలాల్లో కీటకాలను నిర్మూలించేందుకు డెల్టా థింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ కంపెనీ నూతన టెక్నాలజీని వినియోగంలోకి తీసుకువచ్చింది. పంటలను నాశనం చేసే కీటకాలను నిర్మూలించేందుకు రైతులు రసాయనిక ఎరువులను, పురుగుమందులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోవడమే కాక , ప్రజలు రసాయనిక ఎరువులు వాడిన పంట దిగుబడులను తినాల్సి వస్తోంది. ఈ క్రమంలో రైతులకు నష్టాలను తగ్గించేందుకు, ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు నూతనంగా సోలార్‌ లైట్ పరికరాన్ని డెల్టా థింగ్స్ కంపెనీ రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పరికరం పంటల సాగులో రసాయనాల వినియోగాన్ని, సాగు ఖర్చులను తగ్గిస్తుందని రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు తయారీదారులు.

పంట పొలాల్లో పురుగులను నియంత్రించేందుకు సోలార్ లైట్ పరికరాన్ని డెల్టా థింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ కంపెనీ రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, డెల్టా థింగ్స్ ప్రైవేట్‌ లిమిటెడ్ సంయుక్తంగా ఈ పరికరాన్ని రూపొందించారు. సౌర విద్యుత్‌తో రాత్రి వేళల్లో వెలిగే ఎల్‌ఈడీ లైట్‌తో పాటు ప్రత్యేక టబ్బును ఏర్పాటు చేసి కీటకాలను నిర్మూలించేలా దీన్ని రూపొందించారు. పగలంతా సౌరవిద్యుత్‌ను నింపుకుని ప్రత్యేక బ్యాటరీ ద్వారా రాత్రిపూట వెలుగులు విరజిమ్ముతూ ఎల్‌ఈడీ లైట్ పనిచేస్తుంది. ఈ వెలుగులు పురుగులను ఆకర్షిస్తాయి. లైట్‌ వద్దకు చేరుకున్న పురుగులు కాంతిని తట్టుకోలేక కింద ఏర్పాటు చేసిన బుట్టలో పడిపోయి చనిపోతాయి.

సోలార్ లైట్ పరికరం అన్ని రకాల పురుగులను నాశనం చేస్తుందని తయారీదారులు తెలిపారు. తల్లిపురుగును సైతం నియంత్రించి పొలంలో పురుగు ఉధృతిని నియంత్రిస్తుందన్నారు. మారుమూల ప్రాంతంలోనూ ఈ పరికరం ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందని డెల్టా థింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ కంపెనీ సేల్స్‌&మార్కెటింగ్ హెడ్ తెలిపారు. ఈ పరికరం ధర 4 వేల రూపాయలని, ఒకసారి పరికరం కొనుగోలు చేస్తే దీర్ఘకాలం పనిచేస్తుందన్నారు.

పంట పొలాల్లో ప్రయోగాత్మకంగా సోలార్ లైట్ పరికరాన్ని వినియోగిస్తున్న రైతులు సత్ఫలితాలను పొందుతున్నారు. ఎకరం విస్తీర్ణంలో ఒక సోలార్ లైట్ పరికరాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల అన్ని రకాల పురుగులను నియంత్రించగలుగుతున్నామంటున్నారు. ముఖ్యంగా మిరపలో నల్ల తామర పురుగుల ఉధృతి తగ్గిందని తెలిపారు. సేద్యంలో పురుగుల నియంత్రణకు అధికమొత్తంలో వినియోగించే రసాయనాల వాడకం ఈ పరికరం ద్వారా తగ్గి రైతుకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

Full View


Tags:    

Similar News