Country Chicken: నాటుకోళ్ల పెంపకంలో రాణిస్తున్న యువరైతు వాసు

Country Chicken: ఒకప్పుడు గ్రామంలో చిన్నసన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు, మహిళలు నాటుకోళ్ల పెంపకాన్ని ఒక వ్యాపకంగా చేపట్టి ఉపాధి పొందేవారు.

Update: 2021-10-01 08:17 GMT

Country Chicken: నాటుకోళ్ల పెంపకంలో రాణిస్తున్న యువరైతు వాసు

Country Chicken: ఒకప్పుడు గ్రామంలో చిన్నసన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు, మహిళలు నాటుకోళ్ల పెంపకాన్ని ఒక వ్యాపకంగా చేపట్టి ఉపాధి పొందేవారు. అయితే ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం ఒక్కటే లాభసాటి కాదని గ్రహించిన రైతులు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని ఆర్జించి పెట్టే నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టి తమ జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకుంటున్నారు. కరోనా కాలంలో నాటు కోళ్లకు, గుడ్లకు బాగా గిరాకీ పెరిగింది.

ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ, నాటు కోళ్లు సహజ సిద్ధంగా పెరుగుతాయనీ, మంచి రుచి ఉంటుందని వాటిని ఆహారంగా తీసుకునేందకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న గిరాకీ దృష్ట్య నాటు కోళ్ల పెంపకం వైపు యువరైతులు అడుగులు వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం, నల్లవెల్లి గ్రామానికి చెందిన వాసు నాలుగు ఎకరాల మామిడి తోటలను లీజుకు తీసుకుని నాటుకోళ్లను పెంచుతున్నాడు. లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

40 కోళ్లతో ప్రారంభించి ప్రస్తుతం 700 కోళ్లు పెంచుతున్నాడు ఈ యువరైతు. ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకు, అవగాహన లేమి కారణంగా సమస్యలు ఎదురయ్యాయి. అయినా తన పట్టుదలను వదలకుండా ముందుకు సాగాడు. ఎలాంటి సమస్య వచ్చినా దానికి పరిష్కారాన్ని వెతుకుతూ పెంపకంపై మరింత అవగాహన పెంచుకుంటున్నాడు.

బాయిలర్ కోళ్లు, నాటుకోళ్ల పెంపకానికి మధ‌్య చాలా తేడా ఉంటుందని వాసు చెబుతున్నాడు. బాయిలర్ కోళ్లు 45 రోజుల్లో పెరుగుతాయి. అవే నాటుకోళ్లు పెంచేందుకు 5 నుంచి 6 నెలల సమయం పడుతుందంటున్నాడు. ప్రస్తుతం తాను ఫ్రీరేంజ్ లోనే నాటుకోళ్లను పెంచుతున్నాడు. వీటికి దాణాగా 30 శాతం సజ్జలు, జొన్నలు, వడ్లు ను పెడుతున్నాడు. మిగతా 70 శాతం దాణాను కోళ్లు తోట నుంచి సహజసిద్ధంగా సేకరిస్తాయి.

పెంపకం ప్రారంభించే ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఫామ్స్ ను సందర్శించి అక్కడ పరిస్థితులను గమనించిన వాసు మిగతావారికి భిన్నంగా కోళ్లను పెంచాలనుకున్నాడు . అందరిలా చిక్స్‌ కోసం బయటి మార్కెట్ పై ఆధారపడకుండా ముందుగా 40 నాటుకోళ్లను ఏరికోరి ఎన్నుకుని సేకరించాడు. వాటిని ఫ్రీరేంజ్ లో పెంచుతున్నాడు.

కోళ్లు సహజ సిద్ధంగా పొదిగించిన పిల్లలతోనే పెంపకాన్ని విస్తరిస్తున్నాడు. ఇలా పెంచిన కోళ్లు 6 నుంచి 7 నెలలకు కోతకు వస్తాయంటున్నాడు వాసు. మార్కెట్‌లోనూ మంచి ధర పలుకుతోందని చెబుతున్నాడు.

సహజ సిద్ధంగా పెరిగే నాటుకోళ్లకు ఎలాంటి టీకాలు వేయడం లేదంటున్నాడు ఈ పెంపకందారు. ఇప్పటి వరకు కోళ‌్లకు ఎలాంటి వ్యాధులు సోకలేదని చెబుతున్నాడు. అయితే పక్షులు, కుక్కల నుంచి రక్షణగా ఉండేందుకు పొలం చుట్టూ జాలీ ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా ప్రణాళికా బద్ధంగా కోళ్లను పెంచుతున్న ఈ పెంపకందారు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తే మరింత మంది యువత ఈ రంగంవైపు అడుగలు వేసే అవకాశం ఉందంటున్నాడు. 

Full View


Tags:    

Similar News