Entrance Exams 2026 : విద్యార్థులకు అలర్ట్.. మే నెలలో పరీక్షల సందడి.. ఫిబ్రవరి నుంచే అప్లికేషన్లు షురూ

విద్యార్థులకు అలర్ట్.. మే నెలలో పరీక్షల సందడి.. ఫిబ్రవరి నుంచే అప్లికేషన్లు షురూ

Update: 2026-01-29 00:51 GMT

Entrance Exams 2026 : తెలంగాణలో ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కంటున్న విద్యార్థులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి అత్యంత కీలకమైన TG Ed.CET (బీఈడీ), TG ICET (ఎంబీఏ, ఎంసీఏ) ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి అధికారికంగా ప్రకటించింది. బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ తేదీలను ఖరారు చేశారు. ఈసారి పరీక్షల నిర్వహణ బాధ్యతలను వేర్వేరు విశ్వవిద్యాలయాలకు అప్పగించడం విశేషం.

తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE) 2026 సంవత్సరానికి సంబంధించిన కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ల క్యాలెండర్‌ను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షల పూర్తి వివరాలను అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షలన్నీ పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో జరగనున్నాయి.

TG Ed.CET - 2026 (బీఈడీ ప్రవేశాలు): రాష్ట్రంలోని ప్రభుత్వ,ప్రైవేట్ బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్ బాధ్యతను ఈసారి వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం తీసుకుంది.

నోటిఫికేషన్: ఫిబ్రవరి 20, 2026న విడుదలవుతుంది.

దరఖాస్తులు: ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 18 వరకు స్వీకరిస్తారు.

పరీక్ష తేదీ: మే 12, 2026న రెండు సెషన్లలో (ఉదయం 10-12, మధ్యాహ్నం 2-4) పరీక్ష నిర్వహిస్తారు. టీచర్ కావాలనే లక్ష్యంతో ఉన్న వేలాది మంది అభ్యర్థులకు ఇది కీలకమైన సమయం. సకాలంలో దరఖాస్తు చేసుకుని సన్నద్ధమవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

TG ICET - 2026 (ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలు): నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు ఎంతో ఆశగా ఎదురుచూసే ఐసెట్ నిర్వహణ బాధ్యతను నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి అప్పగించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో మేనేజ్మెంట్ సీట్ల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.

నోటిఫికేషన్: ఫిబ్రవరి 6, 2026న వస్తుంది.

దరఖాస్తులు: ఫిబ్రవరి 12న ప్రారంభమై మార్చి 16న ముగుస్తాయి.

పరీక్ష తేదీలు: మే 13, 14 తేదీల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి రోజు రెండు సెషన్లు, రెండో రోజు ఉదయం సెషన్లలో పరీక్షలు ఉంటాయి. దీనికి సంబంధించి సిలబస్, ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

అభ్యర్థులకు సూచనలు: ఈసారి అప్లికేషన్ల స్వీకరణ గడువును పెంచినప్పటికీ, చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవడం మంచిదని కన్వీనర్లు తెలిపారు. సర్టిఫికెట్ల అప్‌లోడింగ్, ఫీజు చెల్లింపులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని కోరారు. అలాగే, పరీక్షా కేంద్రాల ఎంపికలో అభ్యర్థులు తమకు సమీపంలో ఉన్న పట్టణాలను ఎంచుకోవాలని సూచించారు.

Tags:    

Similar News