కిలాడీ సిస్టర్స్ అక్రమ దందా గుట్టురట్టు..ఇద్దరు మహిళలు అరెస్ట్

మధ్యప్రదేశ్‌లో మహిళలను ఉపాధి పేరుతో మోసం చేస్తూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఒక ముఠా గుట్టు పోలీసులు రట్టు చేశారు.

Update: 2026-02-24 10:21 GMT

కిలాడీ సిస్టర్స్ అక్రమ దందా గుట్టురట్టు..ఇద్దరు మహిళలు అరెస్ట్

మధ్యప్రదేశ్‌లో మహిళలను ఉపాధి పేరుతో మోసం చేస్తూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఒక ముఠా గుట్టు పోలీసులు రట్టు చేశారు. భోపాల్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు అమాయక యువతులను ఉద్యోగం పేరుతో ఆకర్షించి దోపిడీకి గురి చేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో 21, 32 ఏళ్ల ఇద్దరు మహిళలతో పాటు వారి సహచరుడు చందన్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం.

పోలీసుల వివరాల ప్రకారం, పేద కుటుంబాలకు చెందిన యువతులకు నెల జీతం, వసతి, ఆహారం కల్పిస్తామని నమ్మించి తమ వద్దకు రప్పించేవారని ఆరోపిస్తున్నారు. అనంతరం వారిని బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ ద్వారా అక్రమ కార్యకలాపాల్లోకి నెట్టినట్లు బాధితులు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అభ్యంతరకర ఫోటోలు, వీడియోలతో ఒత్తిడి తీసుకొచ్చి వారిని నియంత్రించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక మహిళ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. పని పేరుతో ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి దుర్వినియోగం చేసినట్లు ఆమె ఆరోపించింది. మరో మహిళ కూడా తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేయడంతో కేసు తీవ్రత పెరిగింది.

అరెస్టుల అనంతరం నిందితుల మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పలు అనుమానాస్పద గ్రూపులు, యువతుల వివరాలు బయటపడినట్లు అధికారులు పేర్కొన్నారు. బాధితుల వాంగ్మూలాల ఆధారంగా అంతర్రాష్ట్ర నెట్వర్క్ కోణంలో కూడా విచారణ చేపట్టినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Tags:    

Similar News