యడ్యూరప్ప అనే నేను.. సీఎంగా ప్రమాణస్వీకారం

Update: 2018-05-17 05:56 GMT

కన్నడ రాజకీయం కీలక మలుపు తిరిగింది. అతిపెద్ద పార్టీ బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ వాజూభాయ్ వాలా ఆహ్వానించారు. తన బలాన్ని నిరూపించుకొనేందుకు బీజేపీకి 15 రోజులు గడువిస్తున్నట్టు రాజ్‌భవన్ ప్రకటించింది. దీంతో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన యెడ్యూరప్ప ఈ ఉదయం 9 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

కర్ణాటక పొలిటికల్ థ్రిల్లర్‌కు తెరపడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేఎల్పీ నేత యడ్యూరప్పను గవర్నర్ వాజూభాయ్ వాలియా ఆహ్వానించారు. తను బీజేఎల్పీ నేతగా ఎన్నికైనట్లు యడ్యూరప్ప అందజేసిన లేఖ ఆధారంగా ఆయనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినట్లు వాజూభాయ్ తెలిపారు. అంతకు ముందు అందజేసిన లేఖను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు గవర్నర్ ప్రకటించారు. 

కర్నాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని యడ్యూరప్పను కోరిన గవర్నర్.. ఎప్పుడు, ఎక్కడ ప్రమాణస్వీకారం చేస్తారో తెలియజేయాలని కోరారు. అలాగే 15రోజుల్లో బలనిరూపణ చేసుకోవాలంటూ గవర్నర్  సూచించారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడంతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి యడ్యూరప్ప ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బలనిరూపణ తర్వాతే పూర్తిస్థాయి కేబినెట్  విస్తరణ చేయాలని యడ్యూరప్ప భావిస్తున్నారు. 

Similar News