కేటీఆర్ కు కిరీటం..?

Update: 2018-04-09 09:28 GMT

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి మంత్రి కేటీఆర్‌కు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెలలో జరగనున్న పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆయనని నియమిస్తూ ప్రకటన చేస్తారనే ప్రచారం పార్టీలో సాగుతోంది. పార్టీపై పట్టు సాధించేందుకే.. ప్రగతిసభల పేరిట ఆయన జిల్లాలను చుట్టేస్తున్నారని గులాబీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించినప్పటి నుంచి కేసీఆరే అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. సీఎం అయ్యాక పార్టీ కార్యక్రమాల మీద ఆయన పెద్దగా ఫోకస్ పెట్టలేకపోతున్నారు. దీంతో ఆయనకు, పార్టీ నాయకులకు మధ్య గ్యాప్ పెరిగింది. అందువల్ల పార్టీ వ్యవహరాల పర్యవేక్షణకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఉండాలని పార్టీలో సీనియర్లు చాలాకాలంగా కోరుతున్నారు. ఇందుకు కేటీఆర్ సరిగ్గా సరిపోతారని ఆయననే వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు.

2016, 17 పార్టీ ప్లీనరీల్లోనే కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రకటిస్తారని ప్రచారం సాగింది. ఐతే మంత్రి హరీష్ రావు కూడా రేసులో ఉండటంతో ఈ చర్చకు సీఎం కేసీఆర్ పుల్ స్టాప్ పెట్టారు. పార్టీలో అనవసర విభేదాలకు అవకాశం కల్పించకూడదనే ఉద్దేశ్యంతో వర్కింగ్ ప్రెసిడెంట్ ప్లాన్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

ఐతే ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండటం సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా వర్కింగ్ ప్రెసిడెంట్‌ ఉండే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చారు. ఇందులో భాగంగానే కేటీఆర్ జిల్లాల్లో ప్రగతిసభలకు హాజరవుతూ కేడర్‌లో జోష్ నింపడంతో పాటు కాంగ్రెస్ ప్రజాచైతన్య యాత్రకు కౌంటర్లు వేస్తున్నారు.

కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తే ఎన్నికల ప్రచారాన్ని అంతా తానై నడిపిస్తారని అభిప్రాయపడుతున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే సీఎంగా కేటీఆర్ బాధ్యతలు చేపడతారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమీకరణాల మధ్య కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అవడం లాంఛనమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Similar News