కొలిక్కివచ్చిన రాధా నిర్ణయం.. పోటీ అక్కడే..?

Update: 2018-10-10 03:33 GMT

వైసీపీలో విజయవాడ సెంట్రల్ టిక్కెట్ వ్యవహారంపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయినట్టే కనిపిస్తోంది. అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న వంగవీటి రాధా రెండు రోజులుగా సన్నిహితులు, పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. అంతేకాకుండా మొన్న తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లారు. ఈ సందర్బంగా ఆయనకు ఘనస్వాగతం పలికారు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. ఈ పరిణామంతో రాధా వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విజయవాడ సెంట్రల్ సీటు తనకే కావాలని పట్టుబట్టారు రాధా.. అయితే ఈ సీటును మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కేటాయించారు జగన్. దీంతో రాధా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకానొక దశలో పార్టీని వీడేందుకు సైతం సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రాధాకు జనసేన నేతలు టచ్ లోకి వచ్చారు. వెంటనే అప్రమత్తమైన వైసీపీ అధిష్టానం ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించింది. పైగా మచిలీపట్టణం పార్లమెంటుకు పోటీ చెయ్యాలని ఆయనను ఒప్పించినట్టు సమాచారం. రాధా కూడా మళ్ళీ పార్టీ మారడం ఎందుకు అనుకున్నారని.. ఒకవేళ మారినా ఉపయోగం వుండకపోవచ్చనే ఆలోచనతో పార్టీ మార్పు నిర్ణయాన్ని విరమించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సెంట్రల్ సీటు విషయంలో వైసీపీలో నెలకొన్న అభిప్రాయబేధాలు ప్రస్తుతానికి తొలగినట్టేనని పార్టీ నేతలు భావిస్తున్నారు.

Similar News