ఆ రెండు పథకాలు ఆగిపోతాయా?

Update: 2018-09-25 06:24 GMT

తెలంగాణలో ఆ రెండు పథకాలకు బ్రేక్‌ పడనుందా? ముందస్తు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న స్కీమ్‌లకు స్కెచ్‌ వేయనుందా? అన్ని సర్కారీ పథకాల మాదిరిగానే ఈ రెండింటికి కూడా ఎన్నికల కోడ్ అడ్డొవస్తోందా? ఎన్నికల ముందు ఆ పథకాలపై అపద్ధర్మ ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది? ఇంతకీ ఆ రెండు పథకాలేంటి? అడ్డొచ్చే అంశాలేంటి?

తెలంగాణా అసెంబ్లీ రద్దవడం ముందస్తు ముంచుకువస్తుండటంతో రెండు పథకాల అమలుపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. గత ఏడాది ప్రారంభించిన బతుకమ్మ చీరల పంపిణీ, ఈ ఏడాది ఎకరానికి నాలుగు వేలు అందించే రైతుబంధు పథకాలకు ఎన్నికల కోడ్‌ అడ్డొస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది దసరాకు కోటి మంది మహిళలకు ఉచితంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేసింది ప్రభుత్వం. ఈ ఏడాది కూడా దీని కోసం భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది సిరిసిల్ల చీరలు ఇవ్వలేదని విమర్శలు రావడంతో  ఈసారి పూర్తిగా సిరిసిల్లలోనే తయారు చేస్తున్నారు. ఇప్పటికే చీరల ఉత్పత్తి పూర్తి చేసి జిల్లాలకు చేరవేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తుంది అధికార యంత్రంగం.

ఇక ఈ ఏడాది నుంచి రైతులకు ఎకరానికి నాలుగు వేల రూపాయలు... రెండు పంటలకు ఎనిమిది వేలు ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇప్పటికే వానాకాలం పంటకు ఎకరానికి నాలుగు వేల చెక్కులు మే నెలలోనే అందించారు. రెండో పంట యాసంగి కోసం నవంబర్‌లో రైతుబంధు చెక్కులు ఇవ్వాలని ప్రణాళిక రూపొందించారు. ఈ పథకానికి అవసరమైన నిధులను సమకూర్చే పనిలో ఉంది తెలంగాణా ఆర్థికశాఖ. ఇప్పటికే  నిధులను దశలవారీగా వ్యవసాయశాఖ ఖాతాలో జమ చేస్తోంది.

ఈ రెండు ప్రతిష్టాత్మక పథకాలపై ఇప్పుడు ఎన్నికల కోడ్ కత్తి వేలాడుతుందని అంటున్నారు అధికారులు. ఈ పథకాలు అందించే సమయానికే సరిగ్గా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చే అవకాశాలు ఉంటాయిని చెబుతున్నారు. ఈ రెండు పథకాలు కూడా ఓటర్లకు వ్యక్తిగత లబ్ధి కిందకు వస్తాయని ప్రతిపక్షాలూ చెబుతున్నాయి. అయితే ఈ రెండు పథకాలను పాత వాటిగా పరిగణించాలని, గత బడ్జెట్లోనే వీటికి నిధులు కేటాయించారని టీఆర్ఎస్ అంటోంది. బతుకమ్మ చీరలు గత ఏడాది నుంచి అమలులో ఉందని, రైతుబంధు మొదటి దశ చెక్కులు ఇప్పటికే ఇచ్చేసాం కాబట్టి ఇది కూడా అమలులో ఉన్న పథకమేనని  కొత్త పథకంగా భావించొద్దని చెబుతున్నారు.

ఇలా ఎన్నికల కోడ్ వస్తే ఈ రెండు పథకాల కేంద్రంగా ఆరోపణలు ప్రత్యారోపణలు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలంటే ముందే ఈ రెండు నిలిపి వేయాలని ప్రతిపక్షాలు ఈసీని కోరతాయని తెలుస్తోంది. ఈ పథకాలను అడ్డుకొంటే ప్రతిపక్షాలకే నష్టమని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. మహిళలకు,రైతులకు లబ్ది చేకూర్చుతుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రచారం చేయాలని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.

Similar News