ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ పార్టీలు

Update: 2018-04-10 05:50 GMT

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో తెలంగాణలో రాజకీయ పార్టీలు తమ బల ప్రదర్శన చేసే పనిలో పడ్డాయి. భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రత్యర్థులకు సవాల్ విసరాలని డిసైడయ్యాయి. ఇటీవల కొత్తగా  పురుడు పోసుకున్న తెలంగాణ జన సమితి, అధికార పార్టీ ఒకేరోజు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నాయి. 

ఇటీవల జేఏసి చైర్మెన్ కోదండరాం కొత్తగా తెలంగాణ జనసమితి పార్టీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 29న పార్టీ ఆవిర్భావ సభను భారీ ఎత్తున నిర్వహిస్తామని ప్రకటించింది టీజేఎస్. సరిగ్గా ఆనాడే టీఆర్ఎస్ కూడా సికింద్రాబాద్‌లోని పెరెడ్ గ్రౌండ్‌లో గొల్లకురుమల సన్మాన సభ నిర్వహించడానికి సిద్ధమవుతోంది.

తెలంగాణ జనసమితి హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాలలో ఏదో ఒక దానిలో సభ నిర్వహణకు అనుమతి కోరుతూ లేఖలు రాసింది. వాటిలో అధికార పార్టీ ఎంచుకున్న పరేడ్ గ్రౌండ్ కూడ ఉంది. జనసమితి ఆవిర్భావ సభకు పోటీగా అధికార పార్టీ గొల్లకురుమల సభ ఏర్పాటు చేసుకున్నట్టు రాజకీయా వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని సభ నిర్వహిస్తే అదే స్థాయిలో జనసమితి జనసమీకరణ చేయడం ప్రశ్నార్థకమే. అయితే ప్రభుత్వం జనసమితి పార్టీకి అనుమతి ఇవ్వకపోతే కోదండరాం ఏం చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. 

Similar News