నిమ్మల కిష్టప్ప ఢమరుకం..శివప్రసాద్ పాట

Update: 2018-02-10 06:36 GMT

చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌. ఈ పేరు ఠక్కున గుర్తుకురాకపోయినా వెరైటీ ఎంపీగా శివప్రసాద్‌ భలే పాపులర్‌ అయ్యారు. టీడీపీ ఎంపిగా శివప్రసాద్‌కు ప్రజా సమస్యలపై ముందు నుంచే వెరైటీగా నిరసనలు చేపట్టడం అలవాటు. సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి మొన్నటి పార్లమెంట్‌ సమావేశాల వరకు శివప్రసాద్‌ కట్టని వేషం లేదు... పట్టని ఆయుధం లేదు. మొత్తంగా శివప్రసాద్‌ చూసి... ఓర్‌ నీ ఏషాలో అనుకోవాల్సిందే.

 శ్రీకృష్ణుడి వేషం వేస్తారు..సత్య హరశ్చంద్రుడిగా రక్తికట్టిస్తారు.. నారుదుడిగా ఆధ్మాత్మిక భావాలు ఒలికిస్తారు.. చేతిలో చిడతలతో చెక్కభజన చేస్తారు ఇలా ఏ వేషం కట్టాలన్నా వినూత్నంగా నిరసన తెలపాలన్నా ఎంపీ శివప్రసాదే గుర్తుకొస్తారు. ఏపీకి అన్యాయం జరిగిందని బాధపడుతూ వేషం కడతారు. సమాజం అంతా గందరగోళంలో పడిపోయందన్న ఆవేదనతో వేషం కడతారు. వేషం ఏదైనా... దాన్ని అద్భుతంగా రక్తికట్టిస్తారు. ఆకర్షణగా నిలుస్తారు. రాజకీయ నాయకుడిగా, టీడీపీలో సభ్యుడిగా, చట్టసభకు ప్రతినిధిగా ఉన్న శివప్రసాద్‌ తానొక కళాకారుడని చెబుతారు. తాను కట్టే వేషానికి, పార్టీకి సంబంధం లేదంటారు. ప్రజలు పడే ఇబ్బందులను తన వేషభాషల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతుంటానంటారు. 

వినూత్నంగా నిరసన తెలపడంలో టీడీపీ ఎంపీ శివప్రసాద్‌కు మించినవారు రాజకీయాల్లో మరెవరూ లేరు. స్వతహాగా సినీ నటుడు కావడంతో, తన నటనా చాతుర్యాన్ని నిరసన కార్యక్రమాల్లో ప్రదర్శిస్తుంటారు. 
ఏపీకి ప్రత్యేక హోదా, బడ్జెట్‌ కేటాయింపుల్లో అన్యాయాలపై లోక్‌సభలో టీడీపీ ఎంపీలు కదం తొక్కిన సమయంలో శివప్రసాద్‌ తనలోని కళాకారుడిని బటయకు తీశారు. ఢమరుకం మోగిస్తూ హల్‌చల్ చేశారు. ఎంపీలంతా విభజన హామీలను నినదిస్తూ గోవిందా గోవిందా అంటూ నిరసన చేపట్టారు. నిమ్మల కిష్టప్ప ఢమరుకం మోగించగా శివప్రసాద్ పాట పాడుతూ నిరసన తెలిపారు.

రోజుకో వింత వేషంలో వినూత్నంగా నిరసన తెలుపుతూ ఢిల్లీ గల్లీల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు శివప్రసాద్. ఒక చేతిలో నిమ్మకాయ గుచ్చిన కొడవలి, రెండో చేతిలో కొరడా పట్టుకొని చొక్కా వేసుకోకుండా పోతురాజు వేషంలో వచ్చారు. మిగతా ఎంపీల ముందు కూర్చొని తనకే ప్రత్యేకమైన రీతిలో కనిపించారు. మరోసారి తల వెంట్రుకలకు పిలక వేసుకొని.. దానికో రిబ్బన్ కట్టుకొని, మెడలో పూలమాల, కాళ్లకు గజ్జెలు ధరించి చేతిలో చిడతలు పట్టుకొని పార్లమెంట్ బయట పాటలు పాడుతూ నిరసన తెలిపారు. మరో వెరైటీ గెటప్‌‌లో కూడా ప్రత్యక్షమయ్యారు. తలపాగా పెట్టుకొని చేతిలో కంజీరతో కొత్త వేషధారణలో కనిపించారు. జానపద కళారూపం..తప్పెటగుళ్లను తలపించే ఈ కొత్త పాత్రలో కూడా ఆయన జీవించేశారు.

సాధారణంగా నాయకులు ఎవరి మీదనైనా నిరసన వ్యక్తం చేయాలంటే వారి వేషం వేసుకుని.. మెడలో చెప్పుల దండ వేసుకుని తిరగడం, అర్ధనగ్నంగా.. రకరకాల వేషాల్లో ఊరేగడం.. ఇలాంటి చేయటం సాధారణమే. అయితే శివప్రసాద్ ఏ పాత్రకైనా రక్తి కట్టిస్తారు. శివన్న ఏం చేసినా వెరైటీ అన్నట్లు ఏ వేషంలోనైనా అందర్నీ అలరించారు. ఇట్టే ఆకట్టుకుంటారు.

Similar News