శబరిమల కేసులో సుప్రీం కీలక నిర్ణయం

Update: 2018-11-13 12:18 GMT

అన్ని వయసుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన 49 పిటిషన్లను బహిరంగ కోర్టులో విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. వచ్చే ఏడాది జనవరి 22న ఈ పిటిషన్లపై బహిరంగ కోర్టులో విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పాత తీర్పుపై మాత్రం ప్రస్తుతం స్టే ఇవ్వలేమని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన 49 పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి గొగోయ్, న్యాయమూర్తులు ఆర్ఎఫ్ నారిమన్, ఏకే ఖన్విల్కర్, డీవై చంద్రచూడ్‌ల బెంచ్ చాంబర్‌లో చర్చించి 22న ఓపెన్ కోర్టు విచారణకు నిర్ణయించింది. 

సుప్రీంకోర్టు చాలా అరుదుగా రివ్యూ పిటిషన్లను విచారణకు స్వీకరిస్తుందని ఆత్మ డివైన్ ట్రస్ తరపున పిటిషన్ వేసిన లాయర్ మాథ్యూ తెలిపారు. ఉరిశిక్షల విషయంలోనే ఇప్పటి వరకు రివ్యూ పిటిషన్లు స్వీకరించిన దాఖలాలు ఉన్నాయని మాథ్యూ గుర్తుచేశారు. చేతన సంస్థ తరపున రివ్యూ పిటిషన్ వేసిన ముత్తుకుమార్ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. అదేవిధంగా కేరళ దేవస్థానం బోర్డు సభ్యుడు పద్మకుమార్ కూడా సుప్రీం తీర్పును స్వాగతించారు. 
 

Similar News