శిరహట్టి సెంటిమెంట్‌ పీఠమెక్కిస్తుందా? నెట్టేస్తుందా?

Update: 2018-05-15 10:23 GMT

రాజకీయాలకు, సెంటిమెంట్లకు అవినాభావ సంబంధం ఉందని మరోసారి తేలిపోయింది. ఉత్కంఠభరితంగా సాగిన కర్ణాటక ఎన్నికల్లో...శిరహట్టి సెంటిమెంట్...నిజమయ్యింది. ఇంతకూ....ఆ శిరహట్టి సెంటిమెంట్ ఎమిటి?...అసలు....ఎలా పండింది? కర్ణాటక ఎన్నికల చరిత్రను ఓసారి తిరగేసి చూస్తే....శిరహట్టి సెంటిమెంట్ ప్రముఖంగా కనిపిస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 222 శాసనసభ నియోజక వర్గాలు ఉన్నా...శిరహట్టి అసెంబ్లీ ప్రత్యేకతే వేరు.

కర్ణాటక పీఠాన్ని చేజిక్కించుకునేది ఎవరనేది మాత్రం శిరహట్టి నియోజకవర్గం ఫలితంపైనే ఆధారపడి ఉంటుందన్నది రాజకీయవర్గాల నమ్మకం మాత్రమే కాదు...గత మూడుదశాబ్దాలుగా పండుతూ వస్తున్న సెంటిమెంట్ కూడా. 46 సంవత్సరాలుగా శిరహట్టి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే.. అదే పార్టీ ఆ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకుంటుందని రాజకీయ నేతల నమ్మకం మాత్రమే కాదు...విశ్వాసం కూడా.. 1972 నుంచి ఇక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతూ వస్తోంది. ప్రతిష్టాత్మకంగా జరిగిన ప్రస్తుత ఈ ఎన్నికల్లో సైతం అదే నిజమని తేలింది. చరిత్ర పునరావృతమయ్యింది. 2013 ఎన్నికల్లో....కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి...శిరహట్టి స్థానంలో విజయం సాధించడంతో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.

ప్రస్తుత 2018 ఎన్నికల్లో మాత్రం...శిరహట్టి నియోజకవర్గంలో...సీన్ రివర్స్ అయ్యింది. బీజెపీ అభ్యర్థి విజేతగా నిలవడంతో....శిరహట్టి సెంటిమెంట్ పరంపర కొనసాగింది. శిరహట్టి నియోజకవర్గ రికార్డులను చూస్తే... 1972 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వదిరాజాచార్య గెలుపొందగా.. అదే పార్టీకి చెందిన దేవ్‌రాజ్ ఉర్స్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత జరిగిన ..1978 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన నేత ఉపనల్ గులప్ప ఫకీరప్ప... స్వతంత్రంగా పోటి చేసినా.. కాంగ్రెస్సే అధికారంలోకి వచ్చింది.

1983లో కాంగ్రెస్ నాయకుడు ఉపనల్ గులప్ప ఫకీరప్ప స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది జనతా పార్టీకి మద్దతిచ్చాడు. ఆ సమయంలో జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1985లో జనతా పార్టీకి చెందిన అభ్యర్థి బాలికాయ్ తిప్పన్న బసవన్నప్ప గెలవడంతో.. రెండో సారి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 1989 ఎన్నికల్లో.. శిరహట్టి నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1994లో జనతా దళ్ నేత మహంత షెట్టార్ విజయం సాధించగా.. ఆ పార్టీ అధినేత హెచ్‌డీ దేవేగౌడ సీఎం పీఠాన్ని చేజిక్కించుకున్నారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవడంతో.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

2004లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందగా.. జేడీఎస్ మద్దతుతో కర్ణాటకలో కాంగ్రెస్ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. 2008లో శిరహట్టి నుంచి బీజేపీ గెలవడంతో.. సొంత బలంతో కాషాయం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం మీద... 2 లక్షల మంది ఓటర్లున్న శిరహట్టి నియోజకవర్గంలో విజేతగా నిలిచిన పార్టీనే అధికారంలో నిలవడం....సెంటిమెంట్ మాత్రమే కాదు....అక్షరాల నిజమని...గత 46 సంవత్సరాల రికార్డులు చెప్పకనే చెబుతున్నాయి...ఇదంతా చూస్తుంటే....శిరహట్టి ఉట్టి కొట్టిన పార్టీనే కర్ణాటక కోటలో పాగా వేస్తుందని ప్రత్యేకంగా చెప్పాలా మరి. 

Similar News