విశాల్ నామినేషన్ తిరస్కరించిన రిటర్నింగ్ అధికారిపై వేటు

Update: 2017-12-12 10:17 GMT

తమిళనాడు ఆర్కే నగర్ ఎన్నికల రిటర్నింగ్  అధికారిపై వేటు పడింది.   ప్రముఖ  నటుడు విశాల్ కృష్ణ నామినేషన్ వ్యవహారంలో  వివాదాస్పదంగా వ్యవహరించిన ఆ అధికారిపై ఎన్నికల కమిషన్‌ సీరియస్‌గా స్పందించింది. విశాల్‌ నామినేషన్‌ ఉదంతంపై   ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు దిగడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. నామినేషన్ పత్రాలను తిరస్కరించిన  అధికారి వేలుస్వామిని  ఎన్నికల సంఘం వెనక్కి పిలిచింది. గత బుధవారంనాడు విశాల్ నామినేషన్‌ పేపర్లపై రెండు సంతకాలు ఫోర్జరీవిగా గుర్తించిన రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు.

విశాల్, ఆయన మద్దతుదారులు దీనిపై వివరణ ఇవ్వడంతో కొద్దిసేపటికే నామినేషన్ పత్రాలను అంగీకరిస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అనూహ్యంగా మరి కొద్ది సేపటికే ఆయన విశాల్ నామినేషన్‌ను తిరిస్కరిస్తున్నట్టు మరోసారి ప్రకటించారు. విశాల్, ఆయన మద్దతుదారులు తనపై ఒత్తడి తీసుకురావడం వల్లే తాను ఆయన నామినేషన్ పత్రాన్ని అంగీకరించాల్సి వచ్చిందని మునుస్వామి వివరణలో చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, ఈ మొత్తం వ్యవహారంలో రిటర్నింగ్ అధికారి వ్యవహరించిన తీరును ప్రతిపక్ష డీఎంకే ఎండగట్టింది. రాష్ట్ర స్థాయిలో ఈసీ యంత్రాంగం విశ్వసనీయతను ప్రశ్నిస్తూ...వేలుస్వామిని బదిలీ చేయాలని డీఎంకే డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆర్కే నగర్ ఉప ఎన్నికలో రిటర్నింగ్ అధికారి బాధ్యత నుంచి మునుస్వామిని ఈసీ తొలగించింది.

Similar News