16న రాహుల్‌కు పట్టాభిషేకం

Update: 2017-12-12 10:18 GMT

కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఈనెల 16న పగ్గాలు చేపట్టనున్నారు. దాదాపు 19ఏళ్ల పాటు పార్టీ బాధ్యతలు చూసుకున్న సోనియాగాంధీ ఆరోజు తనయుడు రాహుల్‌కు ఆ బాధ్యతలను అప్పగించనున్నారు. దీనికి సంబంధించి పార్టీ నుంచి సోమవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అధ్యక్ష పదవికి నామినేషన్ల తిరస్కరణకు రేపే చివరి తేదీ. అయితే.. రాహుల్‌ ఒక్కరే అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల అథారిటీ(సీఈఏ) ఛైర్మన్‌ ఎం.రామచంద్రన్‌, సభ్యులు మధుసూదన్‌ మిస్త్రీ, భువనేశ్వర్‌ కలితా కలిసి రాహుల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయాన్ని సోమవారం ప్రకటిస్తారు.

అయితే ఈనెల 16న సోనియాగాంధీ, ఇతర సీనియర్ నేతల సమక్షంలో పార్టీ అధ్యక్ష పదవి పదవి నియామకానికి సంబంధించిన సర్టిఫికెట్‌ను రాహుల్‌కు అందజేయనున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతలను కలుసుకున్న అనంతరం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో పార్టీ అధ్యక్ష పగ్గాలను రాహుల్‌ స్వీకరించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు రాహుల్ పట్టాభిషిక్తుడు కానున్నారన్న సమాచారంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి.

Similar News