అర్చకుడి ప్రాణాలు తీసిన మైక్ వివాదం

Update: 2018-11-02 05:41 GMT

మైక్‌ ఒకరి ప్రాణాలు తీసింది. తెల్లవారుజామున మైక్‌లో భక్తి గీతాలు పెట్టినందుకు అర్చకుడిని కొట్టిచంపేశాడు ఓ యువకుడు. వరంగల్‌లో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన నగరంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

మైక్‌ వివాదం ఒకరి ప్రాణాలు బలిగొంది. వరంగల్‌ నగరంలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో ఓ ఆలయ అర్చకుడు ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్‌ పోచమ్మ మైదాన్‌ కూడలిలోని శ్రీ శివసాయి మందిరంలో అర్చకుడి పనిచేస్తున్న దేవళ్ల సత్యనారాయణ అక్టోబర్ 26న ఎప్పటిలాగానే ఉదయం ఐదున్నరకి ఆలయ మైక్‌లో భక్తి పాటలు పెట్టి గుడిలో హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. అయితే మైక్‌ ఆపాలంటూ మరో మతానికి చెందిన యువకుడు అర్చకుడితో వాగ్వాదానికి దిగాడు. మైక్‌ ఆపేందుకు నిరాకరించడంతో దాడికి దిగాడు. వృద్ధుడని కూడా చూడకుండా ముఖం, వీపు, కడుపులో పిడుగుద్దులు కురిపించడంతో పూజారి కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలతో రోదిస్తున్న అర్చకుడు దేవళ్ల సత్యనారాయణను బంధువులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిమ్స్‌కు షిఫ్ట్‌ చేశారు. అయితే చికిత్స పొందుతూ పూజారి దేవళ్ల సత్యనారాయణ మరణించడంతో పటిష్ట బందోబస్తు మధ్య మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. అర్చకుడి సొంతూరు మొగిలిచర్లలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందిడుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ఉద్దేశపూర్వక దాడి, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మైక్‌ వివాదంతో అర్చకుడిపై దాడి జరగడం, చికిత్స పొందుతూ మరణించిన ఘటన వరంగల్‌ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. వరంగల్‌లో పెద్దఎత్తున ఆందోళన నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్ కార్యకర్తలు నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అలాగే ఆలయాలకు, అర్చకులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

Similar News