శభాష్ హరీష్ భాయ్...ఊరంటే ఇలా ఉండాలి

Update: 2018-12-21 09:41 GMT

ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణ రాష్ర్టం ఇబ్రహీంపూర్ గ్రామంపై పడింది. అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిచిన ఆదర్శ గ్రామం ఇబ్రహీంపూర్ జాతీయ స్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇబ్రహీంపూర్ ప్రాముఖ్యతను తెలుసుకునేందుకు ఇతర రాష్ర్టాలు ఉత్సాహం చూపుతున్నాయి. 15 రాష్ర్టాలకు చెందిన 61 మంది ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారుల బృందం గ్రామాన్ని సందర్శించి.. ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. 

ఇబ్రహీంపూర్ సిద్దిపేట మండల పరిధిలో ఎమ్మెల్యే హరీష్ రావు దత్తత తీసుకున్న గ్రామం. ప్రజలు, ప్రభుత్వ సహాకారంతో ఇబ్రహీంపూర్ గ్రామ రూపురేఖలనే మార్చారు హరీష్ రావు. గ్రామస్థుల ఐక్యతతో ఇబ్రహీంపూర్ లో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలయ్యాయి. జాతీయ స్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఇబ్రహీంపూర్ గ్రామాన్ని 15 రాష్ర్టాలకు చెందిన 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల బృందం సందర్శించింది. 

ఇబ్రహీంపూర్ సందర్శనకు వచ్చిన ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ సాంప్రదాయ పద్దతిలో గ్రామస్తులు స్వాగతం పలికారు. విద్యార్థులు పూల మొక్కలు వారికి అందించి గ్రామంలోకి ఆహ్వానించారు. ఆడపడుచులు బతుకమ్మ, బోనాలు, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. మూడు గంటల పాటు గ్రామం అంతటా తిరుగుతూ ప్రజలతో మమేకం అయ్యారు. అభివృద్ది, పర్యావరణ సంరక్షణ కోసం తీసుకుంటున్నచర్యలపై గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. ఇబ్రహీంపూర్ అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యేలు, అధికారుల బృందానికి హరీష్ రావు వివరించారు. గ్రామంలో ఇంకుడు గుంతలు, వర్మికంపోస్ట్ విధానం, పంటల సాగు, గ్రామదర్శిని వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రతక్ష్యంగా చూపించారు. 

ఇబ్రహీంపూర్ ను సందర్శించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. హరీష్ రావును ఆదర్శంగా తీసుకుని తమ ప్రాంతాల్లో పని చేస్తామంటూ పలువురు ఎమ్మెల్యేలు ప్రశంసలు కురిపించారు. వాటర్ మేనేజ్ మెంట్ విషయంలో ఇబ్రహీంపూర్ వాసులు కనబరిచిన ఐక్యత స్ఫూర్తి దాయకమని కితాబిచ్చారు హర్యాన స్పీకర్ కుంవర్. గ్రామాల అభివృద్ధి తోనే దేశ వికాసం సాధ్యమవుతుందన్నారు. ఇబ్రహీంపూర్ సందర్శించిన బృందంలో బీహార్, తమిళనాడు, కేరళ, మణిపూర్, అస్సాం, హర్యాణ, గుజరాత్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, త్రిపుర, ఉత్తరాఖండ్, గోవా, మేఘాలయ ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్య హరీష్ రావు ఎమ్మెల్యేల బృందాన్ని సన్మానించారు..
 

Similar News