దొరలకు ఒక చట్టం..దళితులకు ఒక చట్టమా?

Update: 2017-12-27 09:21 GMT

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. గత పది రోజులుగా జైలులో ఉన్న ఆయన ఈరోజు బెయిల్‌ పై విడుదల అయ్యారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ..టీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని మందకృష్ణ మాదిగ విమర్శించారు. మిలియన్‌ మార్చ్‌, తెలంగాణ ఉద్యమం సందర్భంగా లేని నిర్బంధం ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలపై ఎందుకని ప్రశ్నించారు. 

తాము శాంతియుతంగా ఉద్యమం చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా తాము ఉద్యమం చేశామని మందకృష్ణ తెలిపారు. దొరలకు ఒక చట్టం.. దళితులకు ఒక చట్టమా అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేస్తే ఎమ్మార్పీఎస్‌ అండగా నిలిచిందని.. కానీ వర్గీకరణ కోసం శాంతి యుత ర్యాలీ నిర్వహిస్తే కేసీఆర్‌ తనను 10 రోజులు జైల్లో పెట్టారన్నారు. పార్లమెంట్‌ సమావేశాలు ముగిసేలోపు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని డిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు. జనవరి 1 నుంచి 5 వరకు ఉపవాస దీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

Similar News