కేరళలో భారీ వర్షాలు..26 మంది మృతి

Update: 2018-08-10 04:55 GMT

భారీ వర్షాలతో.. కేరళ అల్లకల్లోలం అవుతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రాంతాలు వానకష్టాలను ఎదుర్కొంటున్నాయి. వర్షాలకు పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో రెండు రోజుల్లోనే ఏకంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటు భారీ వర్షాలకు రాష్ట్రంలోని 24 డ్యాముల గేట్లను ఎత్తివేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఆసియాలోనే అతిపెద్ద డ్యాముగా పేరుగాంచిన చెరుతోని డ్యామ్‌లో భారీగా వరద నీరు చేరడంతో 26 ఏళ్ల తర్వాత తొలిసారి గేట్లు ఎత్తారు. ఇక వరద దెబ్బకు రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. అలాగే భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. 

మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. ఇడుక్కి, కోజికోడ్, వాయనాడ్, మలప్పురం జిల్లాల్లో ఇప్పటికే ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. వరదల ప్రభావంతో ఇడుక్కి, కొల్లాం జిల్లాల్లో అధికారులు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. మరోవైపు వరదలపై ముఖ్యమంత్రి విజయన్‌ మాట్లాడుతూ కేరళ చరిత్రలోనే తొలిసారిగా 24 డ్యాముల గేట్లను ఎత్తాల్సి వచ్చిందని పరిస్థితి ప్రమాదకరంగా ఉందని స్పష్టం చేశారు. వరద పరిస్థితిని సమీక్షించేందుకు సెక్రటేరియట్‌లో 24 గంటలు పనిచేసే ఉచిత టోల్‌ ఫ్రీ నెంబర్‌ను.. పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 

Similar News