తెలంగాణలో కలయికల లుకలుకలు

Update: 2018-06-16 07:32 GMT

ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలంగాణలోనూ ఎవర్ని ఎవరు కలిసినా అపార్థాలు కొత్త వాదనలు వెతుక్కుంటున్నాయి. సమావేశాల మీద రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వేషన్లు, జోన్లపై చర్చించేందుకు ఢిల్లీవెళ్లిన కేసీఆర్‌పైనా ఆరోపణలు చేసింది కాంగ్రెస్. బీజేపీతో కేసీఆర్‌ జట్టుకట్టారని విమర్శిస్తోంది. ఈ ఆరోపణల్లో వాస్తవముందా? కేవలం రాజకీయమేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు, ఢిల్లీ పర్యటన చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త జోన్లు, రిజర్వేషన్ల కోటాపై ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించారు కేసీఆర్. అలాగే పెట్టుబడి సాయం, రైతు బీమాపథకాలపైనా మాట్లాడారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రకటన తర్వాత, కేసీఆర్‌ మోడీని కలవడం ఇదే తొలిసారి.

మోడీ-కేసీఆర్ భేటి అధికారిక కార్యక్రమం అయినా, దీనిచుట్టూ అనేక రాజకీయాలు ముసురుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ అనేక ఆరోపణలు చేస్తోంది. బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారన్న విషయాన్ని బలంగా వాదిస్తోంది ఖద్దరు పార్టీ. కానీ బీజేపీతో టీఆర్ఎస్ జట్టుకడుతోందన్న కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టింది టీఆర్ఎస్. అధికారిక కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేయడం కాంగ్రెస్‌కే చెల్లిందని విమర్శించింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక దేశ ప్రధానిని కలవడం కూడా కుమ్మక్కు పాలిటిక్సేనా అంటూ ఎదురుదాడి చేసింది.

మొత్తానికి అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఎవర్ని ఎవరు కలిసినా పెద్ద రాద్దాంతమే అవుతోంది. ఆ సమావేశాల చుట్టూ రాజకీయాలు ముసురుకుంటున్నాయి. ఒక పొలిటికల్ పార్టీ, మరొక పార్టీని కలవడం చాలా సహజమైన విషయమైనా, రాజకీయ విమర్శలకు కాదేది అనర్హమన్నట్టుగా, ఆరోపణల బాగ్భాణాలు సంధిస్తున్నారని, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్‌ కుమ్మక్కు రాజకీయాలన్న కాంగ్రెస్ ఆరోపణలు రుజువవుతాయో, అటు ఏపీలో కమలంతో వైసీపీ స్నేహం చేస్తోందన్న వాదన నిలబడుతుందో, చెప్పగలిగేది ఒక్క కాలం మాత్రమే. వెయిట్‌ అండ్ సీ.

Similar News