అక్కడ కరుణానిధి అంత్యక్రియలు కుదరవు : ప్రభుత్వం

Update: 2018-08-08 02:02 GMT

కరుణానిధి అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలన్న దానిపై సందిగ్ధం నెలకొంది.. మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు అవకాశం ఇవ్వాలని డీఎంకే చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది. అన్నాదురై సమాధి పక్కనే కరుణ సమాధి ఏర్పాటు చేయడం సాధ్యం కాదని చెప్పి..  గిండి ప్రాంతంలో రెండు ఎకరాలు కేటాయిస్తామని స్పష్టం చేసింది.  డీఎంకే మాత్రం మెరీనా బీచ్‌నే డిమాండ్‌ చేస్తోంది.. ఈ నేపథ్యంలో డీఎంకే నేతలు హైకోర్టును ఆశ్రయించారు.. డీఎంకే కు చెందిన న్యాయవాదులు పిటిషన్‌ వేశారు. చీఫ్‌ జస్టిస్‌ నివాసంలో అర్థరాత్రి వరకు వాదనలు కొనసాగాయి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులిచ్చింది.. మెరీనా బీచ్‌లో నిర్వహించడానికి అభ్యంతరం ఏంటో చెప్పాలని ఆదేశించింది.. దీనిపై ఉదయం 8 గంటలకు తుది వాదనలు జరగనుండటంతోపాటు, తీర్పు  కూడా వెలువడే అవకాశముంది. కాగా కరుణానిధి మృతికి సంతాప సూచికంగా ఢిల్లీలో జాతీయ జెండాని అవనతం చేశారు. ఇవాళ సెలవు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం.. వారం పాటు సంతాప దినాలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర కార్యక్రమాలు మినహా ఈరోజు, రేపు ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది. 

Similar News