కొన్ని గంటల్లో బలపరీక్ష... కన్నడ క్లైమాక్స్‌లో బేరసారాల కథ

Update: 2018-05-19 08:51 GMT

కర్ణాటకలో కథ క్లైమాక్స్‌కు చేరడంతో బేరసారాలు తీవ్రమయ్యాయి. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ అడ్డదారులు తొక్కుతోంది. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తోంది. నిన్న ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేను మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్ధన్‌రెడ్డి ఫోన్‌లో బేరమాడగా... తాజాగా యడ్యూరప్ప తనయుడు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించినట్టు మరో ఆడియో విడుదలైంది. 

తమ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ మరోసారి ఆరోపించింది. డబ్బు, మంత్రి పదవి ఆశజూపి ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవాలని చూస్తోందని మండిపడింది. ఇప్పటిదాకా బీజేపీ నేతలే ఇలాంటి ప్రయత్నాలు చేయగా.. తాజాగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు కూడా ప్రలోభాలకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. దీనికి సాక్ష్యం ఇదిగో అంటూ ఓ ఆడియోను విడుదల చేసింది.

యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర తమ ఎమ్మెల్యేలకు 5కోట్లు, మంత్రి‌ పదవి ఆఫర్‌ చేశారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. విజయేంద్ర మాట్లాడుతున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి విడుదల చేసింది. మరికొద్ది గంటల్లో యడ్యూరప్ప బలపరీక్ష జరగనున్న నేపథ్యంలో ఈ ఆడియో మరింత ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌ నిన్న కూడా ఓ వీడియోను విడుదల చేసింది. అందులో రాయచూరు రూరల్ ఎమ్మెల్యే బసవనగౌడ దద్దల్‌ను బీజేపీ తరఫున మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి ఫోన్‌లో సంప్రదించారు. ఆడియో రికార్డు సారాంశం ప్రకారం.. రాజుగౌడ అనే వ్యక్తి మధ్యవర్తిత్వంలో బసవనగౌడతో గాలి జనార్దన్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. ‘పార్టీ పెద్దలే నేరుగా డీల్‌ గురించి చర్చిస్తారు. నీ జీవితానికి సరిపడా సంపాదించుకునే అవకాశమిది. మంచి సమయంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ అవకాశాన్ని దుర్వినియోగపరచుకోవద్దు’ అంటూ గాలి బేరాలు సాగించారు. 

Similar News