కరీంనగర్‌ కేసీఆర్‌కు కలిసొచ్చే జిల్లా

Update: 2018-09-06 05:58 GMT

అవునన్నా... కాదన్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెంటిమెంట్‌ను బాగా ఫాలో అవుతారు. ప్రతీ మంచి పనికి ముహుర్తం, ప్రతీ శుభకార్యానికి తారబలం చూసుకుంటారు. ఎవరేమనుకున్నా దాన్నే నమ్ముతారు. అలాగే నడుస్తారు. ఇప్పుడు హుస్నాబాద్‌ సభకు కూడా సెంటిమెంటే కీలకమైంది. 

సెంటిమెంట్ ఫాలో అవుతారు...ముహుర్తాన్ని చూసుకుంటారు...ముందస్తు ఎన్నికలకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఎన్నికయ్యే దాకా ఇదే సెంటిమెంట్ను నమ్ముకున్నారాయన. అందులో భాగంగానే హుస్నాబాద్‌లో ప్రజాశీర్వాద సభ అంటూ ఇప్పుడూ అదే బాటలో నడుస్తున్నారు కేసీఆర్‌.

2001 నుంచి ఉద్యమం ఉప్పెనలైన ప్రతీసారి కేసీఆర్‌కు గుర్తుకొచ్చేది కరీంనగర్‌. ఒకరకంగా చెప్పాలంటే కరీంనగర్‌ కేసీఆర్‌కు కలిసొచ్చే జిల్లా. కరీంనగర్‌లోని ఎక్కడి నుంచైనా ఆయనకు బాగా కలిసొస్తుందన్నది ఓ నమ్మకం. తెలంగాణ భౌగోళికంగానూ కరీంనగర్ జిల్లా అంతా కూడా ఈశాన్యంలో ఉంటుంది. సహజంగా కేసీఆర్‌ నక్షత్రానికి, రాశికి ఈశాన్యం అనుకూలంగా ఉండటంతో ఆయన కరీంనగర్‌ వైపు మొగ్గు చూపేవారు.

ఇప్పుడు కూడా కేసీఆర్‌కు కలిసొచ్చే ప్రాంతం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. ప్రజా ఆశీర్వాద సభలుగా నామకరణం చేసిన టీఆర్‌ఎస్‌ ఈ సభలతో ఎన్నికల సమర శంఖం పూరించబోతున్నారు. ఈ ప్రజా ఆశీర్వాద సభలతో అయిదేళ్ల మేనిఫెస్టోను వివరించబోతున్నారు. సెంటిమెంట్‌గా ఈశాన్య ప్రాంతమైన హుస్నాబాద్‌ నుంచి కేసీఆర్‌ ఎన్నికల రణభేరిని మోగించబోతున్నారు.

Similar News