డీఆర్డీవో చైర్మన్‌గా సతీష్ రెడ్డి..

Update: 2018-08-26 03:54 GMT

రక్షణమంత్రి సాంకేతిక సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ సతీశ్‌రెడ్డిని కేంద్ర ప్రభుత్వం.. ప్రతిష్ఠాత్మకమైన డీఆర్డీవో చైర్మన్‌గా నియమించింది. ఈ మేర‌కే ఆయ‌న‌ను నియ‌మిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సతీష్ రెడ్డి రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఇక అయన నియామకంతో డీఆర్‌డీవో చైర్మన్‌ పదవిని అధిరోహించిన రెండో తెలుగువాడు ఈయనే అవుతారు. గతంలో డాక్టర్‌ సూరి భగవంతం ఈ బాధ్యతలను నిర్వర్తించారు. సతీశ్‌రెడ్డి ప్రస్తుతం డీఆర్‌డీవోలోని క్షిపణి వ్యవస్థల విభాగానికి డైరెక్టర్‌ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా సతీష్ రెడ్డిది ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా.

హైదరాబాద్ జేఎన్‌టీయూలో విద్యాభ్యాసం చేసి, క్షిపణి వ్యవస్థలపై పరిశోధన, అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. 1985లో డీఆర్‌డీఓలో చేరారు. అంతరిక్ష పరిజ్ఞానంలో నిష్ణాతుడైన సతీశ్‌రెడ్డి క్షిపణి వ్యవస్థలపై పరిశోధన, అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అలాగే అంతరిక్ష పరిజ్ఞానం, పరిశ్రమల అభివృద్ధికి చేయూతనందించారు. నిశ్చల సెన్సర్లు, నావిగేషన్ పథకాలు, అల్గారిథం వ్యవస్థలు, అమరిక పద్ధతులు, సెన్సర్ మోడళ్లను రూపొందించి, అభివృద్ధి చేసిన బృందాలకు సతీశ్‌రెడ్డి నేతృత్వం వహించారు. అనేక వర్సిటీలు అయన  సేవలు గుర్తించి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ హోమి జే బాబా మెమోరియల్‌ గోల్డ్‌ మెడల్‌, నేషనల్‌ ఏరోనాటికల్‌ ప్రైజ్‌, నేషనల్‌ డిజైన్‌ అవార్డు, నేషనల్‌ సిస్టమ్స్‌ గోల్డ్‌ మెడల్‌ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు ఆయనను వరించాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఆయన కృషిని గుర్తించి ఏపీ ప్రభుత్వం గత ఏడాది సతీశ్‌రెడ్డికి హంస పురస్కారాన్ని ప్రదానం చేసింది.

Similar News