అన్నదాతను వెంటాడిన దురదృష్టం... రూ.33 వేలు ఎత్తుకెళ్లిన దొంగలు

Update: 2018-05-28 09:32 GMT

ఖరీఫ్ సీజన్ వస్తున్నా చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఆ రైతు తల్లడిల్లిపోయాడు. ఇప్పటికే అప్పులు పెరిగిపోవడంతో పొలం బీడు కావాల్సిందేనంటూ కంటతడి పెట్టుకున్నాడు.  అయితే ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు  ఆ బక్కచిక్కిన రైతుకు కొండంత అండగా నిలిచింది.  కాని విధి వక్రీకరించి ... ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము దొంగల పాలు కావడంతో మహబూబ్ నగర్ జిల్లాలో ఓ పేద రైతు గుండె పగిలింది. తీవ్ర మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఏటికి ఎదురేగి .. చీడపీడలను జయించి ...  అడవి జంతువులతో పోరాడి ...  పకృతి వైపరిత్యాలను తట్టుకుని  పంట సాగు చేసిన అన్నదాత ..  చేతిలోని నగదును దొంగలు ఎత్తుకెళ్లడాన్ని తట్టుకోలేకపోయాడు. దురదృష్టం తనకు వెంటాడుతుంటే తట్టుకోలేకపోయాడు. భార్య, బిడ్డలను వదిలి లోకం నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న ఈ ఘటన  మహబూబ్ నగర్ జిల్లా  జడ్చర్ల మండలం గంగాపూర్‌లో జరిగింది. 

గంగాపూర్ గ్రామానికి చెందిన మల్లయ్యకు 8ఎకరాల 10 గుంటల పొలం ఉంది. గత కొద్ది కాలంగా సాగు కలిసి రాకపోవడంతో తీవ్రంగా అప్పుల పాలయ్యాడు. అయిన చోట్లంతా అప్పులు తెచ్చి పంట సాగు చేసినా ఫలితం దక్కలేదు. గతేడాది గొడ్డుగోదా తెగనమ్మి బంగారం కుదువబెట్టి పత్తి సాగు చేసినా నష్టాలు తప్పలేదు. దీంతో ఈ ఏడాది పంట సాగు చేసేందుకు కూడా డబ్బు లేకపోవడం సాగుకు దూరమయ్యే పరిస్ధితులు వచ్చాయి.  ఈ సందర్భంలో రైతు మల్లయ్యకు రైతు బంధు పథకం కటిక చీకటిలో కాంతిలా కనిపించింది. భవిష్యత్‌పై ఆశలు చిగురించాయి.  సాగు సంపన్నం కావడానికి ఇదే తొలి అడుగు అనుకున్నాడు. బ్యాంకుకు వెళ్లి గంటల తరబడి లైన్లో నిలబడి డబ్బులు డ్రా చేసుకున్నారు. 33 వేల రూపాయల నగదు చూసి మురిసిపోయారు. కానీ వాళ్ల సంతోషం ఎంతో సేపు నిలబడలేదు. ఓ దొంగ రూపంలో వారి ఆశలు ఆవిరై పోయాయి. లెక్కించి ఇస్తానంటూ నమ్మకంగా చెప్పిన ఓ గుర్తు తెలియని వ్యక్తి డబ్బు తీసుకొని ఉడాయించడంతో మల్లయ్య గుండె పగిలింది. 

దొంగతనంపై పోలీసులకు  ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో  మల్లయ్య తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.  మూడు రోజుల నుంచి అన్నం ముట్టకుండా తనలో తానే మథనపడిన మల్లయ్య ఉదయం ఎవరికి చెప్పకుండా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  మల్లయ్య ఆత్మహత్య గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తీవ్ర విషాదం నింపింది. ఎవరో చేసిన పనికి మల్లయ్య బలయ్యాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పెద్దను కోల్పోయిన మల్లన్న కుటుంబానికి  ప్రభుత్వమే అండగా నిలవాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు.
 

Similar News