కర్నాటకలో భారీగా బయటపడ్డ నకిలీ ఓటర్ కార్డులు

Update: 2018-05-09 05:35 GMT


కర్నాటకలో రేపటితో ప్రచారం ముగుస్తున్న వేళ పెద్ద ఎత్తున నకిలీ ఓటర్ కార్డులను అధికారులు గుర్తించారు. భారీగా నకిలీ ఓటర్ కార్డులను తయారుచేసి   సంచుల్లో  ఇతర  ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తుండగా అధికారులు పట్టుకున్నారు. బెంగళూరు పరిధిలోని రాజరాజేశ్వరి నగర్‌లో పదివేల నకిలీ ఓటర్ కార్డులతో పాటు లక్ష కార్డులు తయారుచేసేందుకు సిద్ధంగా ఉంచిన ముడి సామాగ్రిని సీజ్ చేశారు. 

కన్నడనాట పోలింగ్‌ సమయం సమీపిస్తున్న  కొద్దీ రాజకీయ పార్టీలు అడ్డదారులు తొక్కేందుకు సిద్ధమయ్యాయి. గెలుపును ప్రభావితం చేసేలా  వేలాది నకిలీ ఓటర్‌ కార్డులతో ప్రజా తీర్పును అపహాస్యం చేసేందుకు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్ధులు ప్రయత్నాలు ప్రారంభించారు.  అధికారుల నుంచి సేకరించిన రహస్య కోడ్ ఆధారంగా  ఇంటర్నెట్ ద్వారా  గడచిన రెండు రోజుల్లో పెద్ద సంఖ్యలో  కొత్త ఓట్లర్లను చేర్చారు. ముఖ్యంగా బెంగళూరు నగర పరధిలోని 32 నియోజకవర్గాలపై కన్నేసిన అభ్యర్ధులు  ఓటర్ల  జాబితా పెద్ద ఎత్తున నకిలీ ఓటర్లను చేర్చారు.  ఈ రెండు రోజుల్లో   సగటున ఏడు శాతం మేర ఓట్లు పెరగడంతో అప్రమత్తమైన ఎన్నికల కమిషన్ విచారణ చేపట్టింది. 

బెంగళూరు పరిధిలోని రాజరాజేశ్వరి నగర్‌లో 10 వేల నకిలీ ఓటర్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్ధానికంగా ఉన్న అపార్ట్‌మెంట్‌లో  నకిలీ ఓటర్ ఐడీ కార్డులను తయారుచేస్తున్నట్టు గుర్తించి పోలీసులు దాడి చేశారు. నకిలీ ఓటర్ కార్డులతో పాటు తయారికి వినియోగించే ప్రింటర్‌, జిరాక్స్, కంప్యూటర్ ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.  ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌లు పరస్పరం  ఆరోపణలకు దిగాయి. పొరుగు రాష్ట్రాల నుంచి ఓటర్లను రప్పించి ఓటు వేసేందుకే ఇలాంటి కుట్రలను పాల్పడుతున్నారంటూ నేతలు ఆరోపించారు. 
    

Similar News