ఏకవీర...ఎన్ని యేండ్లు గడిచిన ప్రేమకి చిరునామానే

Update: 2018-11-27 12:21 GMT

తొలి తెలుగు జ్ఞానపీఠ బహుమతి గ్రహీత, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఏకవీర నవల ఈ సినిమాకు ఆధారం. ఈ సినిమాకు మాటలు రాసింది మరో జ్ఞానపీఠ గ్రహీత సి.నారాయణరెడ్డి. నారాయణరెడ్డి తన సినీరచనా జీవితంలో సంభాషణలు రాసిన సినిమాలలో ఇది మొదటిది. విశ్వనాథ సత్యనారాయణకు చిత్ర రూపం సంతృప్తి కలిగించలేదు. తొలిసారి విడుదలైనప్పుడు వ్యాపారపరంగా చిత్రం విజయవంతం కాలేదు కానీ, తరువాత విడుదలల్లో తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని కొంతవరకూ ఆదరించారు. కె.వి.మహదేవన్ సంగీతం, దేవులపల్లి, నారాయణ రెడ్డిల సాహిత్యం చిత్రాన్ని అజరామరం చేసాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే.....తమిళనాడులోని మదురై నేపథ్యంగా కథ సాగుతుంది. కథాకాలం నాయకరాజుల పరిపాలనా కాలం. కుట్టాన్ సేతుపతి (ఎన్.టి.ఆర్), వీరభూపతి (కాంతారావు) ప్రాణస్నేహితులు. కుట్టాన్ సేతుపతి రాచకుటుంబీకుడు కాగా వీరభూపతి సామాన్యమైన మధ్యతరగతి రైతుబిడ్డ. పరిస్థితుల కారణంగా సేతుపతి ఏకవీర (కె.ఆర్.విజయ) ను, వీరభూపతి మీనాక్షి (జమున) ను పెళ్ళి చేసుకుంటారు. నిజానికి సేతుపతి మీనాక్షిని, వీరభూపతి ఏకవీరను ప్రేమించి ఉంటారు. ఈ నలుగురి మధ్య అంతరంగ సంఘర్షణ చిత్రంలో ఆవిష్కరింపబడింది. ఇప్పటి వరకు నవల చదవకున్న...లేదా సినిమా చూడకున్న ఒక సారి ఈ సినిమా చూడవచ్చు. శ్రీ.కో.

Similar News