భూరికార్డుల ప్రక్షాళనలో మరో ముందడుగు

Update: 2018-12-26 07:46 GMT

భూ రికార్డుల ప్రక్షాళన కొనసాగిస్తున్న తెలంగాణ సర్కార్ ఇప్పుడు వివాదస్పద భూములపై దృష్టి సారించింది. ఒక్కో భూ సమస్యపై దృష్టిపెట్టి  పరిష్కారించాలని సీఎం కేసీఆర్ రెవిన్యూ శాఖకు ఆదేశించారు. అవసరమైతే కక్షిదారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని కోరారు. త్వరలో ధరణి వెబ్‌సైట్ అందుబాటులోకి రానున్నది. 

తెలంగాణ ప్రభుత్వం కొద్ది నెలల క్రితం  భూరికార్డుల ప్రక్షాళన చేపట్టింది. వివాదరహిత భూములు, కొన్ని భూముల చిన్న సమస్యలు పరిష్కరించి కొత్త పాస్ బుక్ లు అందజేసింది. రైతు బందు, రైతు ధీమా పథకాలు వర్తింపజేసింది. ఇప్పుడు వివాదాస్పద భూముల సమస్యల పరిష్కారంపై సర్కార్  దృష్టిసారించింది. గత ఏడాది కాలంలో భూరికార్డులను సవరించి సుమారు 52 లక్షల మంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందజేశారు. వివిధ కారణాల వల్ల దాదాపు ఆరులక్షల మంది రైతులకు సంబంధించిన 17,89,595.18 ఎకరాలు వివాదాస్పదంగా ఉండటాన్ని గుర్తించారు. ఈ వివాదాస్పద భూములను బీ క్యాటగిరీలో చేర్చారు. 

వివాదస్పద భూముల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో బీ-క్యాటగిరీలో ఉంచిన భూముల పరిష్కారంకోసం అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. కక్షిదారులతో మాట్లాడి ఒప్పించి రైతుల ఆమోదంతో వివాదాలకు పుల్‌స్టాప్ పెట్టనున్నారు. పార్ట్-బీ క్యాటగిరీలో రకరకాల వివాదాల్లో చిక్కుకున్న భూములు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య తగాదాలు, పొలంగట్టు సమస్యలతో ఎక్కువ భూములు ఉండగా, కోర్టు వివాదాల్లో పెండింగ్‌లో ఉన్న భూములు పరిష్కారానికి అధికారులు ప్రయత్నం చేయనున్నారు. వివాదాల్లో లేకున్నా ఆబ్సెంట్ రైతు, విదేశాల్లో ఉన్న భూ యజమానులకు కూడా పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇస్తారు. ఒక్కో సమస్యపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి పరిష్కారం చేయాలని ఉన్నతాధికారులు, తహసీల్దార్లు, ఆర్డీవోలను ఆదేశించారు.

ఏజెన్సీల్లో సాగుచేసుకొంటున్న రైతుల భూములకు యాజమాన్య హక్కులను కల్పించే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా చొరవ తీసుకోనున్నారు. భూరికార్డుల నిర్వహణలో పారదర్శకత కోసం ధరణి వెబ్‌సైట్ త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే సీసీఎల్‌ఏ వెబ్‌సైట్‌ద్వారా ప్రజలు తమ భూమి రికార్డులను చూసుకునే వెసులుబాటును కల్పించింది. 

Similar News